ఆ లేఖపై స్పందించిన హరిరామ జోగయ్య
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ లేఖపై హరి రామ జోగయ్య స్పందించారు. అది ఫేక్ లెటర్ అని, ఆ లేఖను తాను రాయలేదని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా లెటర్ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానళ్లలో సర్కులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. కాపులను పవన్ తాకట్టు పెట్టారని, ఆయన నిజంగా ప్యాకేజి స్టార్ అనుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయనే కల్పించారని జోగయ్య రాసినట్లుగా లేఖ ఒకటి ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ లేఖపై హరి రామ జోగయ్య స్పందించారు. అది ఫేక్ లెటర్ అని, ఆ లేఖను తాను రాయలేదని చెప్పారు. ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని జన సైనికులకు, కాపు నేతలకు, కాపు సామాజిక వర్గానికి జోగయ్య విజ్ఞప్తి చేశారు. టిడిపి, జనసేన పొత్తు దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అంటూ సోషల్ మీడియాలో తన పేరుతో ఒక లేఖ వైరల్ గా మారిందని జోగయ్య చెప్పారు.
జనసైనికులు, కాపు సంఘం నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. వైసీపీ నేతలు ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతూనే ఉంటారని, దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి జోగయ్య పిలుపునిచ్చారు. అంతేకాకుండా, రాబోయే ఎన్నికలలో జనసేన,టిడిపి పొత్తును బలపరిచి గెలిపించాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు జన సైనికులు, కాపు సామాజిక వర్గం ఆయన వెంటే ఉండాలని జోగయ్య విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకారం ఓ అధికారిక లేఖను విడుదల చేశారు.