వదల బొమ్మాళీ వదల.. పవన్‌ కు జోగయ్య మరో లేఖ!

ఈ క్రమంలో తాజాగా హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి.

Update: 2024-03-06 11:30 GMT

తనకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు అవసరం లేదని.. యుద్ధం చేసేవారు కావాలంటూ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తాడేపల్లిగూడెం జెండా సభలో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. సలహాలివ్వడం తేలికని.. ప్రతి ఒక్కరూ తనకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇక తాను ఎలాంటి సలహాలు ఇవ్వబోనని.. మీ ఖర్మ అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే ఆయన పవన్‌ కు మరో లేఖ రాశారు. పవన్‌ వద్దనా తాను మరణించేవరకు జనసేన పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు.

ఈ క్రమంలో తాజాగా హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. మలి విడత జాబితాను నేడో రేపో ప్రకటించనున్నాయి. జనసేన పార్టీ మొత్తం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేయబోతోంది.

ఈ నేపథ్యంలో జోగయ్య.. పవన్‌ కు సలహా ఇస్తూ లేఖ సంధించారు. ఈ లేఖలో పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను కూడా ఆయన డిసైడ్‌ చేయడం విశేషం. తాను సూచించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలని.. వీరు గెలుపొందుతారని.. తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో వీరి పేర్లను సూచిస్తున్నానని తెలిపారు.

ముఖ్యంగా రాయలసీమలో 20 లక్షల మంది బలిజ ఓటర్లు ఉన్నారని.. వీరిని ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో బలిజలకు న్యాయం చేయాలన్నారు. అనంతపురం నుంచి టీసీ వరుణ్‌ కు, మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట నుంచి ఎంవీ రావు, పుట్టపర్తి నుంచి బ్లూమూన్‌ విద్యా సంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లె నుంచి కొండా నరేంద్ర, గుంతకల్లు నుంచి మణికంఠకు టికెట్లు ఇవ్వాలని హరిరామజోగయ్య.. పవన్‌ కు సూచించారు.

హరిరామ జోగయ్య సూచించిన అభ్యర్థులంతా బలిజ (కాపు) సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. రాయలసీమలో అన్ని పార్టీలు బలిజలను నిర్లక్ష్యం చేస్తున్నాయని.. కాబట్టి బలిజలకు న్యాయం చేయాలని జోగయ్య కోరారు.

కాగా జనసేనాని తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. మార్చి 5న బీసీ డిక్లరేషన్‌ ను మంగళగిరిలో విడుదల చేసిన ఇద్దరు నేతలు మార్చి 6న మరోసారి ఉండవల్లిలో భేటీ అయ్యారు. రెండో విడత అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఇరు పార్టీలు రెండో విడత జాబితాను విడుదల చేయనున్నాయి.

Tags:    

Similar News