ఎవడా యూజ్‌లెస్ ఫెలో... సభలో హరీశ్ వర్సెస్ కోమటిరెడ్డి

తాజాగా మాజీమంత్రి హరీశ్‌రావు వినియోగించిన పదాలు సభలో గందరగోళానికి దారితీశాయి.

Update: 2024-12-19 11:12 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో.. నేతలు వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. తాజాగా మాజీమంత్రి హరీశ్‌రావు వినియోగించిన పదాలు సభలో గందరగోళానికి దారితీశాయి.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు సభలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ‘యూజ్ లెస్ ఫెలో’ అంటూ హరీశ్ అనడంతో ఒక్కసారిగా సభ్యులు అభ్యంతరం చెప్పారు. ‘ఎవడా యూజ్‌లెస్‌ఫెలో దొంగ అన్నది. నన్ను ఎవడైనా దొంగ అంటే.. వాడిని యూజ్‌లెస్‌ఫెలో అని అన్నాను. అది తప్పా?’ అని హరీశ్ మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కల్పించుకున్నారు. హరీశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు లాంటి సీనియర్ ఇలా మాట్లాడడం క్షమించరాని నేరం అని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుంటే కడుపు మంటతోనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని అప్పుల పాలు చేశారని, దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని అన్నారు. హరీశ్ రావు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

హరీశ్ తన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. హరీశ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. సభలో ఎవరో సభ్యులు దొంగ.. దొంగ.. అని అనడం తాను విన్నానని.. వారు క్షమాపణ చెబితే తాను కూడా చెబుతానని హరీశ్ అన్నారు. సభ్యులు అన్నది వినిపించలేదని, కానీ.. మైక్‌లో మాట్లాడిన హరీశ్ మాటలు వినిపించాయని మంత్రి చెప్పారు. స్పీకర్ కల్పించుకొని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు.




Tags:    

Similar News