పీఏసీ ఛైర్మన్ పదవిపై హరీశ్ ప్రశ్న.. మరి మజ్లిస్ కు ఎలా ఇచ్చారంటూ కౌంటర్

పీఏసీ ఛైర్మన్ పదవిని కుకట్ పల్లి అరికపూడి గాంధీకి కట్టబెట్టటంపై మొదలైన రచ్చ ఎక్కడెక్కడికో వెళుతోంది.

Update: 2024-09-13 05:30 GMT

పీఏసీ ఛైర్మన్ పదవిని కుకట్ పల్లి అరికపూడి గాంధీకి కట్టబెట్టటంపై మొదలైన రచ్చ ఎక్కడెక్కడికో వెళుతోంది. నిజానికి ఈ పదవిని మాజీ మంత్రి హరీశ్ రావు ఆశించారు. అయితే.. ఆయనకు కట్టబెట్టకుండా అరికపూడి గాంధీకి కట్టబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన.. అధికారికంగా పార్టీ మారనప్పటికీ.. పార్టీ మారే అంశంపై ఇప్పటికే ఒక క్లారిటీ ఇవ్వటం తెలిసిందే. సాంకేతికంగా చూసినప్పుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందే వస్తారు. గులాబీ పార్టీ కోరుకున్నట్లుగా హరీశ్ కు ఈ పదవి ఇచ్చే విషయంలో రేవంత్ సర్కారు సుముఖంగా లేదు.

దీనికి కారణం లేకపోలేదు. ధర్మంగా చూసినప్పుడు 2018లో ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ పదవిని దక్కుండా ఏడుగురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న మజ్లిస్ కు ఆ పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫునగెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం ద్వారా వారంతా పార్టీ మారేలా చేశారు. దీంతో.. మజ్లిస్ కంటే తక్కువ బలంతో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇలా నాడు పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ కు దక్కుండా చేసిన కేసీఆర్ కు.. అలాంటి పాఠమే చెప్పాలన్నట్లుగా రేవంత్ తీరు ఉంది.

ఇదిలా ఉంటే.. గతంలో తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు హరీశ్ రావు. కాంగ్రెస్ కు అప్పట్లో ప్రతిపక్ష హోదా లేదని.. అందుకే తాము మజ్లిస్ కు ఇచ్చామంటూ ఆయన చెబుతున్న మాటలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓవైపు మజ్లిస్ ను మిత్రపక్షంగా చెప్పుకుంటున్నప్పుడు అదే పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి ఎలా కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతుందంటూ హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఘాటు కౌంటర్లు వస్తున్నాయి. పదేళ్ల గులాబీ పార్టీ పాలనతో ఎంత భారీగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగాయో మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు.

అప్పట్లో కేసీఆర్ చేసినట్లే చేస్తే.. తప్పులు ఎత్తిచూపుతున్న హరీశ్ అండ్ కో.. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాడు పనులను సమర్థించుకోవటాన్ని తప్పు పడుతున్నారు. అందుకే.. చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నారన్నట్లుగా తాజా పరిస్థితి నెలకొంది. అదే సమయంలో..వాళ్లు ఏదో తప్పు చేశారు కాబట్టి.. వాళ్లకు బుద్ది చెప్పాలన్నట్లుగా రేవంత్ సర్కారు వ్యవహరించటం కూడా సరికాదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా తాజా ఎపిసోడ్ తెలంగాణలో పొలిటికల్ హీట్ ను రాజేసిందని చెప్పాలి.

Tags:    

Similar News