సీఎంగా హరీశ్ కు బాధ్యతలు అప్పగించాలట.. సవాలు సరే మామను అడిగారా?

కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ .. మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి హరీశ్.

Update: 2024-02-15 04:33 GMT

రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు మామూలే. అందునా రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు.. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఎంతలా ఇబ్బంది పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ ప్రాజెక్టును నీళ్లు లేకుండా చేశారంటూ అదే పనిగా తప్పు పడుతున్న గులాబీ నేతలకు సీఎం రేవంత్ సవాలు విసరటం తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ .. మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి హరీశ్. తమపై బురద చల్లే ప్రయత్నంలో రైతులకు అన్యాయం చేయొద్దన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా.. అది ముమ్మాటికీ తెలంగాణకు వదరాయనిగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగునీరు.. సాగునీరు ఇచ్చినట్లుగా చెప్పిన హరీశ్.. ఆ ప్రాజెక్టు అందించిన ఫలాల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయటం వల్ల ఎలాంటి లాభం లేదన్నారు.

పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికి అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారన్న హరీశ్.. ‘‘మీకు చేతకాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పితప్పుకోండి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమనండి. నాకు చేతకాదు.. హరీశ్ నువ్వు చెయ్ అని సీఎం రేవంత్ అంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆ పని చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తానంటే తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ హరీశ్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

కాళేశ్వరంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదనే హరీశ్ మాటల్లో.. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ రేవంత్ ను డిమాండ్ చేసిన వైనాన్ని గులాబీ నేతలు పలువురు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. విషయాన్ని అటు తిప్పి.. ఇటు తిప్పి తనను ముఖ్యమంత్రిని చేయాలని హరీశ్ రావు అడగటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే తమకు అధికారం ఇవ్వాలని.. రేవంత్ రాజీనామా చేసిన తెలంగాణ జాతిపితను సీఎంను చేయాలన్న మాట హరీశ్ నోటి నుంచి రావాలే కానీ.. ఇలా రావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కేసీఆర్ ను పొగిడే ఏ సందర్భాన్ని విడిచి పెట్టకూడదన్న గులాబీ పార్టీ తంబ్ రూల్ ను హరీశ్ మిస్ కావటం ఒక ఎత్తు అయితే.. తనను సీఎం చేయాలంటూ హరీశ్ నోటి నుంచి వచ్చిన మాటను బీఆర్ఎస్ నేతలు అండర్ లైన్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటున్నారు. హరీశ్ మాటలో వచ్చిన మార్పుపై గులాబీ బాస్ మరింత ఫోకస్ చేయాలన్న వాదన మొదలుకావటం గమనార్హం.

Tags:    

Similar News