నో డౌట్ ఆయనే హర్యానా కొత్త సీఎం

ఎందుకంటే ఇంటా బయటా తీవ్రమైన వ్యతిరేక ప్రచారం బీజేపీకి వచ్చింది. ఇక బలమైన జాటు కులస్తులు బీజేపీని వ్యతిరేకించారు

Update: 2024-10-08 13:52 GMT

హర్యానాలో బీజేపీ వరసబెట్టి మూడవసారి గెలిచింది. ఇది అపూర్వ విజయం. ఎందుకంటే ఇంటా బయటా తీవ్రమైన వ్యతిరేక ప్రచారం బీజేపీకి వచ్చింది. ఇక బలమైన జాటు కులస్తులు బీజేపీని వ్యతిరేకించారు. అంతే కాదు పదేళ్ల పాటు పాలన చేయడంతో వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీని తట్టుకోవడం కష్టమే.

అయితే బీజేపీ హై కమాండ్ ఇవన్నీ గుర్తించి ఈ ఏడాది మార్చిలో అప్పటికి తొమ్మిదిన్నరేళ్ళుగా సీఎంగా ఉన్న మనోహర్ ఖట్టర్ ని తప్పించి ఆయన ప్లేస్ లో నాయబ్ సింగ్ సైనీని తెచ్చింది. ఆయనది బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం. అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆయన తొలిసారి 2014లో హర్యానా లోని నారైన్‌గఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2015లో హర్యానా ప్రభుత్వంలో కార్మిక ఉపాధి, ఇంధన శాఖల మంత్రిగా పని చేశారు.

ఆయన పనితీరుని గుర్తించిన బీజేపీ నయాబ్ సింగ్ సైనీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కురుక్షేత్ర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. దాంతో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై 3.83 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మీద బీజేపీ గురి పెట్టి 2023 అక్టోబర్ 28న హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక 2024 మార్చి 12న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం బిజెపి శాసనసభ పార్టీ నాయకుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అలా ఆయన ఏడు నెలల క్రితం హర్యానాకు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.

పార్టీని ఆయన నడిపిన తీరు, ప్రభుత్వాన్ని జనాలకు చేరువ చేసిన విధానం, ఎన్నికలను ఎదుర్కొన్న వ్యవహారం అన్నీ కలసి ఆయననే మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నాయి. 54 ఏళ్ల వయసు ఉన్న నయాబ్ సింగ్ సైనీ బీజేపీకి ఇపుడు అతి పెద్ద ఆశా కిరణంగా మారారు ఆయన ఆరెస్సెస్ చాయిస్ కూడా కావడంతో ఆయననే మళ్ళీ సీఎం గా చేయాలని చూస్తున్నారు. దాంతో ఆయన మళ్ళీ సీఎం గా ప్రమాణం చేయడం అన్నది లాంచనమే తప్ప మరేమీ కాదని అంటున్నారు.

ఆయన చాకచక్యం రాజకీయంగా ఆయన వ్యూహాలు అభ్యర్ధుల ఎంపిక, పార్టీని ఏకత్రాటి మీద నడిపించడం అన్నది కమలానికి ఘన విజయం అందించాయని అంటున్నారు. దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో బీజేపీకి రాజకీయ ప్రకంపనలు పుడతాయని రెండు చోట్లా ఓటమి తప్పదని అంతా జోస్యం చెప్పిన నేపథ్యంలో నయాబ్ సింగ్ సైనీ హర్యానాలో కమల వికాసం జరిపించడంతో పాటు కేంద్రంలోని బీజేపీకి కూడా కొత్త ఊపిరులు పోశారని అంటున్నారు. దాంతో ఈ విజయాన్ని బీజేపీ పెద్దలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ఆ విధంగా బీజేపీలో నవతరం నేతగా నయాబ్ సింగ్ సైనీకి రానున్న రోజులలో ఉజ్వల భవిష్యత్తు ఉందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News