అదరగొట్టిన వానతో హైదరాబాద్ మరోసారి ఆగమాగం
పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతోనాలాలు పొంగిపోర్లాయి. పెద్ద ఎత్తున వాననీళ్లు రోడ్ల మీద నిలిచిపోవటంతో వాహనదారులు తమ వాహనాల్ని నడపటం కష్టంగా మారింది.
మండే ఎండలతో ఠారెత్తించే ‘మే’లొ అకాల వర్షం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. అనూహ్య రీతిలో విరుచుకుపడిన వానతో హైదరాబాద్ మహానగర వాసులు మరోసారి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు తీవ్రమైన వేడితో ఉక్కిరిబిక్కిరి అయిన దానికి భిన్నంగా మధ్యామ్నం రెండు గంటల తర్వాత నుంచి వాతావరణంలో హటాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యామ్నం మూడున్నర గంటల వేళలో మొదలైన చినుకులు.. నాలుగు గంటల సమయానికి భారీ వానతో దంచి కొట్టింది. దాదాపుగా గంటన్నర నుంచి రెండు గంటల పాటు కుమ్మేసిన వానతో హైదరాబాద్ మహానగరం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
అత్యధికంగా ఖైరతాబాద్ లో 9 సెంటీమీటర్లు.. షేక్ పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెర్వు వరకు.. పాతబస్తీ మొదలు మాదాపూర్.. మేడ్చల్ మల్కాజిగిరితో పాటు.. నగర శివారు వరకు వాన దంచి కొట్టింది. ఊహించని రీతిలో విరుచుకుపడ్డ మెరుపు వానలతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చిన్నపాటి వర్షానికే వణికే మహానగరం తాజాగా కురిసిన భారీ వానతో ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం ఆగమాగమైంది.
పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతోనాలాలు పొంగిపోర్లాయి. పెద్ద ఎత్తున వాననీళ్లు రోడ్ల మీద నిలిచిపోవటంతో వాహనదారులు తమ వాహనాల్ని నడపటం కష్టంగా మారింది. దీనికి తోడు మెట్రో స్టేషన్ల కింద భారీగా టూవీలర్లు నిలిపి ఉంచటంతో.. మిగిలిన వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి. మొత్తంగా ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. భారీగా కురిసిన వాన కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు వేలాది మంది. నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు పట్టిన దుస్థితి.
మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వేసవిలో ఈ వర్షాలేమిటి? అంటూ లబోదిబోమంటున్నారు రైతులు. ఇదిలా ఉండగా.. ఈ రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ అదేశాలు జారీ చేశారు.