విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు...?
వైసీపీకి ఏపీలో అనుకూల వాతావరణం ఉందని కొన్ని సర్వేలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా ఎంపీ సీట్లనే వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి.
వైసీపీకి ఏపీలో అనుకూల వాతావరణం ఉందని కొన్ని సర్వేలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా ఎంపీ సీట్లనే వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. అయితే చాలా చోట్ల ఎంపీ సీట్ల విషయంలో అభ్యర్ధుల ఎంపిక వైసీపీ హై కమాండ్ కి తలకాయ నొప్పిగా ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినాయకత్వానికి ఎంతో ఇష్టమైన విశాఖలో ఎపీ అభ్యర్ధి ఎవరు అన్నది కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.
వైసీపీకి అనూహ్యమైన అభ్యర్ధులే గెలుపు గుర్రాలు అన్న సెంటిమెంట్ ఎటూ ఉంది. అయితే ఈసారి అది వర్కౌట్ అవుతుందా అన్నదే చర్చగా ఉంది. విశాఖ ఎంపీ అభ్యర్ధిగా 2014లో ముందు నుంచి ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మను పోటీకి దించితే బీజేపీ టీడీపీ పొత్తులతో కూటమి గెలిచింది. లక్ష ఓట్ల తేడాతో విశాఖ సీటులో విజయమ్మ ఓడిపోయారు.
ఇక 2019లో ఎవరో బిగ్ షాట్స్ అని అంతా పేర్లు చెప్పి మరీ ప్రచారం చేస్తే అప్పటికి కొద్ది నెలల ముందు మాత్రమే వైసీపీలో చేరిన ఎంవీవీ సత్యనారాయణ అనే బిల్డర్ టికెట్ దక్కించుకుని అనూహ్యంగా గెలిచారు. మరి 2024లో ఎవరు అభ్యర్ధి అంటే రకరకాలైన పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు అభ్యర్ధి అన్నది మాత్రం పక్కాగా తేలడంలేదు
ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీ ఎంవీవీని విశాఖ తూర్పు నుంచి అభ్యర్ధిగా అసెంబ్లీకి పోటీ చేయిస్తున్నారు. ఆయన కూడా అసెంబ్లీకే మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈసారి బీసీలకే ఈ సీటు ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది అన్న మాట మాత్రం బయటకు వచ్చింది. అయితే ఎవరికి సీటు అన్నదే చూడాల్సి ఉంది.
విశాఖ పార్లమెంట్ పరిధిలో చూస్తే బీసీలు అధికంగా ఉన్నారు. ఆ తరువాత కాపులు ఉంటారు. ఇక బీసీలలో యాదవ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. 2009లో ప్రజారాజ్యం తరఫున యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తే ఏకంగా మూడు లక్షల రెండు వేలకు పై చిలుకు ఓట్లు సాధించారు. టీడీపీని మూడవ స్థానంలోకి నెట్టారు.
ఆ లెక్కలను నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ యాదవులకే టికెట్ ఇవ్వాలని చూస్తోంది. ఇక ఇద్దరు అభ్యర్ధులను ఆ పార్టీ అనుకుంటోందని అంటున్నారు. అందులో మొదటి పేరు ఎమ్మెల్సీగా ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్. ఆయన విశాఖ తూర్పు నుంచి రెండు సార్లు పోటీ చేసి తనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకున్నారు. సౌమ్యుడు వివాద రహితుడు. జగన్ కి బహు ఇష్టుడు. అయితే ఆయన ఎంపీగా పోటీ కంటే ఎమ్మెల్యేనే కోరుకుంటున్నారు. విశాఖ తూర్పులో పోటీ చేయాలని ఆయనకు ఉంది. కానీ ఎంవీవీ వైపు హై కమాండ్ మొగ్గు చూపింది దాంతో వంశీ ఎంపీకి ఎస్ అంటారా అన్నది డౌట్ గా ఉంది.
ఇక రెండవ పేరు చూస్తే విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. ఆమె విద్యాధికురాలు. నగర పరిపాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళా ప్రతినిధిగా ఉండడం ఆమెకు మరో ప్లస్ పాయింట్. దాంతో ఆమె వైపు కూడా వైసీపీ మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే విశాఖ మేయర్ విశాఖ ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.
ఇక వీరెవరూ కాకుంటే విశాఖలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. మొత్తానికి ఈసారి బీసీ కార్డుతో విశాఖ ఎంపీ సీటు పట్టాలని అనుకుంటోంది. మరి వైసీపీ నుంచి ఎవరు ఎంపీ క్యాండిడేట్ అంటే చూడాలనే అంటున్నారు.