ఏపీలో రంగుల రాజకీయం... హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్న క్యాంటిన్లకు ఉన్న పసుపు రంగుపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-10-16 17:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రంగులు కూడా కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజకీయాల్లో ఈ రంగులు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్న క్యాంటిన్లకు ఉన్న పసుపు రంగుపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భాగమైపోయిన రంగుల వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. 2014-19 సమయంలో కాలువల పక్కనున్న కొబ్బరి చెట్ల నుంచి కరెంట్ స్థంభాల వరకూ పసుపు రంగు వేశారంటూ అప్పటి ప్రతిపక్షం నానాయాగీ చేసింది. అయితే... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలను నీలం, ఆకుపచ్చ రంగులతో నింపేసింది.

దీనిపైనా 2019-24 మధ్య ఉన్న ప్రతిపక్షం టీడీపీ తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. దీనిపై పలువురు కోర్టుని ఆశ్రయించారు. అప్పట్లో దీనిపై స్పందించిన న్యాయస్థానం... గ్రామ/వార్డు సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని తీర్పు ఇచ్చింది! ఈ నేపథ్యలో అన్న క్యాంటిన్ లకు పసుపురంగు పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ సందర్భంగా... గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో స్పందించిన హైకోర్టు.. రంగును బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించింది. అన్న క్యాంటిన్లకు గతంలో ఏ రంగులు వేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. దీంతో.. ఏపీ రాజకీయాల్లో రంగుల అంశం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News