విజయసాయిరెడ్డికి బిగ్ షాక్!
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పిటిషన్ పై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి హైకోర్టు ఈ పిటిషన్ ను విచారించింది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్ లో సముద్రానికి అతి సమీపంలో ఆమె నిర్మించిన ప్రహారీ గోడ విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అధికారులకు సూచించింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని.. దీన్ని కూల్చివేయాలని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అధికారులు ఈ ప్రహరీ గోడ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు,
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పిటిషన్ పై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి హైకోర్టు ఈ పిటిషన్ ను విచారించింది. నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ విషయంలో చర్యలు తీసుకోవాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ మూర్తి యాదవ్ తరఫున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్ వాదనలు వినిపించారు. నిర్మాణాల కూల్చివేతకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అయితే అధికారుల ఆదేశాలను సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ వేశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. దీంతో స్టే ఉత్తర్వులు లేనప్పుడు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలకు జారీ చేసింది.
కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం జిల్లా భీమిలిలో సముద్రానికి అతి సమీపంలో భీమిలి బీచ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా పర్యాటకుల రాకపోకలను సైతం అడ్డుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.