సహజీవనంతో వివాహ వ్యవస్థ నాశనం: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
ప్రస్తుతం సహజీవనం (లివ్ ఇన్ రిలేషిన్ షిప్) భారత్ లో బాగా ట్రెండవుతోంది. పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోకి ఈ కల్చర్ విస్తరిస్తోంది.
ప్రస్తుతం సహజీవనం (లివ్ ఇన్ రిలేషిన్ షిప్) భారత్ లో బాగా ట్రెండవుతోంది. పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోకి ఈ కల్చర్ విస్తరిస్తోంది. అయితే దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు ఉన్నారు. సహజీవన సంబంధాలతో భారత వివాహ వ్యవస్థ కలుషితమవుతోందని అంటున్నారు. ఈ విధానంలో మహిళలకు, వారి ద్వారా పుట్టే బిడ్డలకు భద్రత కరువుతోందనే ఆందోళనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సహజీవనంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సహజీవనం ద్వారా ఒక క్రమ పద్ధతిలో భారత్ వివాహ వ్యవస్థ ధ్వంసం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లోని వివాహ వ్యవస్థను ఒక క్రమంలో ధ్వంసం చేసేలా ఈ సహజీవన వ్యవస్థ పని చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఒక కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేసింది.
ఒక వ్యక్తికి వివాహం ద్వారా అందే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. సహజీవన సంబంధాలు అందించవని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రతి సీజన్ లో ఒక భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన (సహజీవనం) స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఒకవేళ వివాహ వ్యవస్థ కనుమరుగయితేనే మన దగ్గర సహజీవనం అనేది సాధారణమవుతుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా చెలామణీ అవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. ఇలాంటి ధోరణికి యువత ఆకర్షితులు అవుతున్నారని వాపోయింది. ఈ తీరుతో దీర్ఘకాలంలో చోటు చేసుకునే చెడ్డ పరిణామాల పట్ల అవగాహన ఉండటం లేదని హైకోర్టు పేర్కొంది.
కాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇచ్చిన మాట తప్పాడని ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల యువతి తన సహజీవన భాగస్వామిపై కేసు పెట్టింది. తాను గర్భవతినని, తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన భాగస్వామిపై అత్యాచార ఆరోపణలు కూడా చేసింది.
అయితే ఇద్దరూ ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. అత్యాచారం కేసు పెట్టడం ఏమిటని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఈ సందర్భంగా సహజీవన వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.