ఎండ ఎఫెక్ట్ తో రోజులో 25 మంది పోలింగ్ సిబ్బంది ప్రాణాలు పోయాయి

కోట్లాది మంది పాల్గొనే ఎన్నికలు సరైన టైంలో జరగట్లేదా? అంటే అవుననే చెప్పాలి.

Update: 2024-06-01 05:00 GMT

కోట్లాది మంది పాల్గొనే ఎన్నికలు సరైన టైంలో జరగట్లేదా? అంటే అవుననే చెప్పాలి. మండే ఎండల్లో జరుగుతున్న ఎన్నికలు చివరి దశకు వచ్చేశాయి. ఈ రోజుతో ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దశ పూర్తి కానుంది. ఏడో విడత పోలింగ్ ఈ రోజు (శనివారం) ఉదయం మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు సాగనుంది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. 2019తో పోలిస్తే ఈసారి పెరిగిన ఎండల కారణంగా.. రాజకీయ నేతలు మొదలుకొని ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునే సిబ్బంది.. సభలకు హాజరయ్యే ప్రజలు పెద్ద ఎత్తున అవస్థలకు గురయ్యారు. పార్టీ అధినేతలు సైతం ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు.

ఇంతటి వేసవిలో ఎన్నికల నిర్వహణ అవసరమా? అన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా శుక్రవారం పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. తీవ్రమైన ఎండతో పాటు.. పెద్ద ఎత్తున వీసిన వడగాల్పుల కారణంగా ఒకే రోజులో భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కాసిన ఎండకు దేశంలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్ లో నిప్పులే కాచాయా? అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. గత వారంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. శుక్రవారం నాగపూర్ లో ఎండ తీవ్రత ఏకంగా 56 డిగ్రీలకు చేరటం గమనార్హం.

ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు ఏసీలు సైతం పని చేయని పరిస్థితి. అయితే.. ఇంత ఉష్ణోగ్రత నమోదైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలను అధికార యంత్రాంగం ఖరారు చేయాల్సి ఉంది. నాగపూర్ లో కాచిన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఇళ్లల్లో ఉన్నా.. ఉక్కపోతతో ఉండలేని పరిస్థితి. ఇంట్లో ఉండలేక.. అలా అని బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

నాగపూర్ తో పాటు.. ఢిల్లీ.. రాజస్థాన్.. హర్యానా.. పంజాబ్.. బిహార్ లో భారీ ఎత్తున వడగాల్పులు వీస్తున్నాయి. వడగాల్పుల కారణంగా దేశ వ్యాప్తంగా 40 మంది మృత్యువాత పడగా.. అందులో పాతిక మంది పోలింగ్ సిబ్బంది కావటం పెను విషాదంగా చెప్పాలి. మండే ఎండల్లో ఎన్నికల్ని నిర్వహించకుండా కాస్త ముందు కానీ.. తర్వాత కానీ నిర్వహించి ఉంటే.. ఈ మరణాలు చోటు చేసుకునేవి కావని చెప్పాలి. రోజులోనే రికార్డు స్థాయిలో పాతిక మంది మరణించగా.. మొత్తం ఎన్నికల ప్రక్రియలో భానుడి దెబ్బకు బలైన వారి సంఖ్య ఎక్కువనే చెబుతున్నారు. తీవ్రంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను మార్చాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News