తెలంగాణ ఎలక్షన్స్.. కేసీఆర్ మనవడి ఆన్‌లైన్ ప్రచారం.. తెగ వైరల్ అవుతున్న పోస్టు
తన తాత, సీఎం కేసీఆర్ పాలనను హైలెట్ చేస్తూ.. ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ప్రధానంగా కేసీఆర్ వల్లే.. ఇప్పుడు తెలంగాణ సస్య శ్యామలంగా ఉందంటూ హిమాన్సు వ్యాఖ్యానించారు.
తనకు రాజకీయాలు అంటే పెద్దగా ఇష్టం లేదని.. ఆదిశగా తాను అడుగులు వేయబోనని.. కొన్నాళ్ల కిందట మీడియాకు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు.. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఆన్ లైన్ ప్రచారం ప్రారంభించారు. మాతాతే గ్రేట్ అంటూ.. ఆయన కొన్ని ఉదాహరణలతో సహా నెట్టింట పెట్టిన పోస్టులు.. ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఘట్టం తీవ్రస్థాయిలో దుమ్ము రేపుతోంది. ప్రధాన పార్టీల మధ్య కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి.. మూడో సారి అధికారంలోకి రావాలని అధికార పార్టీబీఆర్ ఎస్ పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని.. బీఆర్ ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా చెప్పారో.. లేక.. తనకే తోచిందో తెలియదు కానీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కల్వకుంట్ల హిమాన్షు.. తాజాగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన తాత, సీఎం కేసీఆర్ పాలనను హైలెట్ చేస్తూ.. ఆయన సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ప్రధానంగా కేసీఆర్ వల్లే.. ఇప్పుడు తెలంగాణ సస్య శ్యామలంగా ఉందంటూ హిమాన్సు వ్యాఖ్యానించారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. హిమాన్షు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండడం గమనార్హం.
ఇదీ.. హిమాన్సు ప్రచారం
+ ఒక దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి.. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు నిదర్శనం. పారదర్శకత, పట్టుదల, తపనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
+ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవం వచ్చింది. సమ్మిళిత వృద్ధి సాధ్యమైంది.
+ సామాజిక సాధికారత, పర్యావరణ సుస్థిరతకు కేసీఆర్ ఎంతో పాటు పడుతున్నారు. ముఖ్యమంత్రి సమర్ధత, సమర్థవంతమైన పాలన నమూనాకు ఇది మచ్చుతునక.
+ నల్గొండలో ఫ్లోరోసిస్ నిర్మూలన, పాలమూరు వలసల నిరోధం, రైతుల ఆత్మహత్యలకు దారితీసిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడం వంటి కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
+ తాగు, సాగునీటి సమస్య లేకుండా చేశారు. బడుగు బలహీన వర్గాల పట్ల అంటరానితనం లేకుండా చేశారు. హైదరాబాద్ ను ప్రశాంత నగరంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు అల్లర్లతో అట్టుడికిన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచారు. శాంతిభద్రతలు సుభిక్షంగా ఉన్నాయి.
+ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. మాత శిశు మరణాలు లేకుండా చూశారు. ఆరోగ్య సంరక్షణకు కొత్తపథకాలు అమలు చేశారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. కారే రావాలి, కేసీఆరే గెలవాలి అంటూ హిమాన్షు ట్వీట్ ముగించారు.