వరల్డ్ కప్ ఫైనల్ లో ఎందుకు ఓడామో చెబుతున్న సీఎం!
వన్ డే వరల్డ్ కప్ ముగిసింది. లీగ్ దశలో వరుసగా 9 మ్యాచ్ లు, నాకౌట్ దశలో సెమీస్ అద్భుత పెర్ఫార్మెన్స్ తో గెలిచిన టీం ఇండియా
వన్ డే వరల్డ్ కప్ ముగిసింది. లీగ్ దశలో వరుసగా 9 మ్యాచ్ లు, నాకౌట్ దశలో సెమీస్ అద్భుత పెర్ఫార్మెన్స్ తో గెలిచిన టీం ఇండియా... ఫైనల్ మ్యచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ బాధ నుంచి అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులూ ఇంక తేరుకోలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో ఫైనల్ లో టీం ఇండియా ఓటమికి గల కారణాలను రాజకీయ నాయకులు తమదైన శైలిలో వివరిస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా ముఖ్యమంత్రి చేరారు.
అవును... క్రికెట్ ప్రపంచ కప్ 2023 నవంబర్ 19న ముగిసినప్పటికీ, దానిపై రాజకీయ దుమారం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా మ్యాచ్ ఓటమిపై రాజకీయ ట్విస్ట్ ఇచ్చారు.
తాజాగా ఒక రాజకీయ ర్యాలీలో పాల్గొన్న సీఎం శర్మ మాట్లాడుతూ... ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఫైనల్ ఆడినట్లు చెప్పారు. గాంధీ కుటుంబ సభ్యుడి పుట్టినరోజుతో వచ్చే రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించకుండా భవిష్యత్తులో చూసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
"ఆ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. మనము ప్రతి గేం లో గెలిచాము కానీ ఫైనల్ లో ఓడిపోయాము. ఆ రోజు ఏమిటి? ఎందుకు ఓడిపోయాము? మనం హిందువులం, నేను రోజు ప్రకారం వెళ్తాను. ఇందిరాగాంధీ జయంతి అయిన రోజున ప్రపంచకప్ ఫైనల్ ఆడాము.. అందుకే ఓడిపోయాము" అని చెప్పుకొచ్చాడు అస్సాం సీఎం.
అందుకే ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పాలనుకుంటున్నలు తెలిపిన ఆయన... వరల్డ్ కప్ ఫైనల్ గేం ఉంటే ఓ లెక్క వేయండి.. ఆ రోజును గాంధీ కుటుంబానికి సంబంధం ఉన్న రోజైతే దేశం నష్టపోతుంది అని అన్నారు. ఇదే సమయంలో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని ముఖ్యమంత్రి శర్మ తెలిపారు. దీంతో... వరల్డ్ కప్ ఓటమిపై స్పందించిన రాజకీయ నాయకుల లిస్ట్ లో ఇప్పుడు సీఎం కూడా చేరినట్లయ్యింది.
కాగా... ప్రపంచకప్ ఫైనల్ 2023 మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశించడం "పనౌటీ" (చెడు శకునము) అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పడంతో రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కాకుండా లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియా ఫైనల్ లో విజయం సాధించేదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.