ఇలా తప్పులు చేసి దొరికిపోతే ఎలా భువనేశ్వరి?
గతంలో మాదిరి సెంటిమెంట్ విషయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే నెమ్మదితనం తగ్గిపోయింది. ఇలాంటి వేళ.. వేసే ప్రతి అడుగు అప్రమత్తత చాలా అవసరం.
గతానికి వర్తమానానికి మధ్య తేడా పెరిగిపోయింది. గతంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టి.. దానికి సెంటిమెంట్ కలర్ ఉంటే.. తొందరపడి ఒక మాట అనటానికి సాహసించేవారు కాదు. ఏం అంటే మరేం జరుగుతుందో అన్న ఆందోళన ఉండేది. అందుకే.. నిజాన్ని నిజంగా చెప్పటానికి బదులుగా మౌనంగా ఉండేవారు. మీడియాస్థానంలో సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాస్తవాల్ని బయటపెట్టేందుకు.. అభిప్రాయాల్నివెల్లడించేందుకు అస్సలు సంకోచించటం లేదు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో సున్నితమైన అంశాలను సైతం చర్చకు తెచ్చి చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
గతంలో మాదిరి సెంటిమెంట్ విషయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే నెమ్మదితనం తగ్గిపోయింది. ఇలాంటి వేళ.. వేసే ప్రతి అడుగు అప్రమత్తత చాలా అవసరం. ఆ విషయాన్ని మిస్ అయినట్లుంది తెలుగుదేశం పార్టీ. తాజాగా చంద్రబాబు జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆయన జైలుకు వెళ్లారన్న వార్తను విని.. తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించేందుకు బాబు సతీమణి పరామర్శ యాత్రను షురూ చేయటం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ లెక్క ప్రకారం ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు జైలును తట్టుకోలేక మరణించిన వారు 150 మంది. అధికార వైసీపీ లెక్కల్లో మాత్రం ఒక్కరంటే ఒక్కరు లేరు. ఎవరి వాదనల్లో ఎంత నిజం ఉందన్న విషయాన్ని నిగ్గు తీయటం అంత తేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో.. తాను వినిపిస్తున్న వాదనల్లో పస ఎంత ఉన్నా.. చూపిస్తున్న ఆధారాలతో మాత్రం తెలుగు తమ్ముళ్లు అడ్డంగా బుక్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి కారణం.. తాజాగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి నిర్వహిస్తున్నయాత్ర సందర్భంగా.. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించే క్రమంలో బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కును అందజేస్తున్నారు. అయితే.. ఈ చెక్కుల్లో డేట్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు ముందుగానే డేట్ వేసి సంతకాలు ఉన్న చెక్కులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చంద్రబాబు జైలు వేళ.. వేదనతో మరణించిన కుటుంబాలకు ఇచ్చే చెక్కుల్లో తేదీలు.. చంద్రబాబు జైలుకు ముందే ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తప్పులు ఎలా చేస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సాంకేతికంగా చూసినప్పుడు.. పెద్ద పెద్ద సంస్థల్లో చెక్కు పుస్తకాల మీద ముందుగానే సంతకాలు తీసుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు. కానీ.. రాజకీయాలకు వచ్చేసరికి.. ఇలాంటి నిజాలు అక్కరకు రావు సరి కదా.. వేలెత్తి చూపేందుకు సాయం చేయటానికి..రచ్చ చేసే ఛాన్సు ఇస్తాయన్న విషయాన్ని భువనేశ్వరి అండ్ కో గుర్తిస్తే మంచిది.