ఎప్పుడూ లేనంతగా ఖైరతాబాద్ గణేశ్ కు క్రేజ్
మరో రోజులో (మంగళవారం) హైదరాబాద్ మహానగరంలో నిమజ్జన కార్యక్రమం జరగనుంది.
మరో రోజులో (మంగళవారం) హైదరాబాద్ మహానగరంలో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ.. పోలీసు.. వాటర్ వర్క్స్ విభాగంతో సహా ప్రభుత్వ పెద్దలు సైతం తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మంగళవారం జరుగుతున్న నిమజ్జనానికి కాస్త ముందుగానే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనకార్యక్రమాన్ని పూర్తి చేయాలనన ప్లానింగ్ లో ఉన్నారు. ఈసారి నిమజ్జనం మంగళవారం రావటంతో.. చాలామందికి మంగళవారం నిమజ్జనం చేయకూడదన్న సెంటిమెంట్ ఉంది. దీంతో.. తొమ్మిదో రోజైన ఆదివారమే నిమజ్జనాన్ని చేపట్టారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం వద్దకు భారీగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మాత్రం అంతకు రెటింపుగా వస్తున్న భక్తులతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోతోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా శనివారం నాలుగున్నర లక్షల మంది భక్తులు వస్తే.. ఆదివారం ఏకంగా 6 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడ్ని దర్శించుకోవటానికి వచ్చారు.
దీంతో.. ఖైరతాబాద్ తో పాటు ఐమ్యాక్స్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఒక దశలో.. భక్తులు ఊపిరి ఆడనట్లుగా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే.. పోలీసులు స్పందించి.. వీఐపీ దర్శనాల్ని నిలిపివేయటంతో పాటు.. భక్తులు ఎవరూ రావొద్దన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేయటంతో మరిన్ని చర్యలు తీసుకోవటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా చెప్పాలి.
ఇక.. ఈ రోజు (సోమవారం) సైతం ఉదయం నుంచి గణేశుడి దర్శనం లేదని చెబుతున్నా.. చూసేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. మహా నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టేందుకు.. భారీ ఊరేగింపు కోసం అధికారులు..ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం కోసం భక్తులు ఎవరూ రావొద్దని చెబుతున్నా.. వేలాదిగా వస్తున్న పరిస్థితి. దీంతో నిర్వాహకులు.. పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు శోభాయాత్రను మొదలు పెట్టి.. నిమజ్జనాన్ని పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. క్రేన్ నెంబరు 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది.
హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున వినాయకచవితిని నిర్వహించటం మామూలే అయినా.. ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేకత ఉంది. 1954లో తొలిసారి ఏర్పాటు చేసినప్పుడు అడుగు ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అడుగు చొప్పున ఎత్తు పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తు.. 28 అడుగుల వెడల్పుతో సప్తముఖ మహాశక్తి మట్టి గణపతిని రూపొందించారు.ఇందుకోసం వెయ్యి సంచుల మట్టి.. 18 టన్నుల ఇనుము.. 2 వేల మీటర్ల నూలు వస్త్రం.. 2 వేల మీటర్ల జూట్ ను వాడారు. ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో 7 తలలు.. 7 సర్పాలు.. రెండు వైపులా ఏడేసి చేతుల చొప్పున.. మొత్తం పద్నాలుగు చేతులతో భారీవిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణేశుడికి కుడివైపున 12 అడుగుల ఎత్తుల బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.