వామ్మో.. గ్యాస్ ట్యాంకర్ ఎంత పని చేసింది!?
కర్ణాటకలో భారీ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తించింది.
కర్ణాటకలో భారీ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ సమీప ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తించింది. ధార్వాడ– బెళగావి మధ్య పుణె– బెంగళూరు (పీజీ) జాతీయ రహదారిపై హైకోర్టు బెంచ్ వద్ద ఉన్న ఓ రైల్వే అండర్ పాస్ కింద ఒక గ్యాస్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది.
ట్యాంకర్ డ్రైవర్ అవగాహన లేకుండా అవతలి వైపునకు వెళ్లగా, ట్యాంకర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో అండర్ పాస్ పైకప్పుతో రాపిడి జరిగి ఇరుక్కుపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ట్యాంకర్ ముందుకు, వెనక్కు కదల్లేదు. దీంతో అండర్ పాస్ మీదుగా రాకపోకలు ఆగిపోయాయి. గ్యాస్ ట్యాంకర్ ను తొలగించడానికి ఏకంగా 16 గంటల సమయం పట్టింది.
మరోవైపు గ్యాస్ ట్యాంకర్ లో గ్యాసు ఉండటంతో.. అది లీకు అవుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. విషయం తెలిసిన తరువాత జిల్లాధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది క్రేన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో అటుగా వెళ్లేవారు, వచ్చేవారు ఇబ్బందులు పడ్డారు.
గ్యాస్ లీకు అవుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్తు ప్రసారాన్ని నిలిపి వేశారు. ఇళ్లల్లో దీపాలు, గ్యాసు స్టవ్ లు వెలిగించవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఎవరూ ఇళ్లల్లో అగ్గిపెట్టె వాడరాదని, వంటలు చేయరాదని ప్రకటించారు.
అలాగే అండర్ పాస్ మీదుగా వచ్చే వాహనాలను, ప్రయాణికులను కూడా అటు రానీయకుండా వేరే వైపు వెళ్లాలని సూచించారు. వేరే ట్యాంకర్‌ను తెప్పించి అందులోకి గ్యాస్‌ను డంప్ చేశారు. తరువాత ఖాళీ ట్యాంకర్‌ను క్రేన్లతో బయటకు లాగారు. నిపుణుల సహకారంతో ట్యాంకర్ ను రైల్వే అండర్ పాస్ నుంచి బయటకు తీశారు.
గంటల కొద్దీ రాకపోకలను ఆపేయడంతో ప్రజలు, ఉద్యోగులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఇళ్లల్లో ప్రజలు వంటలు చేసుకోకపోవడంతో ఆకలి బాధ పడ్డారు. మొత్తానికి 16 గంటల పాటు అందరిని టెన్షన్ పెట్టిన గ్యాస్ ట్యాంకర్ ఉదంతం ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.