ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభంజనం.. వాటే స్ట్రైకింగ్ రేట్ బ్రో!

అందుకే అంటారు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు అణిగిమణికి ఉంటే బాగుంటుందని.

Update: 2024-06-04 08:15 GMT

అందుకే అంటారు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు అణిగిమణికి ఉంటే బాగుంటుందని. కానీ.. చేతిలో పవర్ ఉన్న వేళ.. చుట్టూ ఏమీ పట్టదు. ప్రజల మద్దతు ఉన్నప్పుడు తనకు మించిన తోపు లేరన్నట్లుగా ఫీల్ అయ్యే నేతలు చాలామందే ఉంటారు. నిజానికి అదంతా ప్రజలు తమకు పెట్టిన భిక్ష తప్పించి.. ఇంకేమీ కాదన్న సింఫుల్ విషయాన్ని మర్చిపోతారు. అభిమానంతో తాము ఇచ్చిన అధికారాన్ని చేతబట్టిన తర్వాత తమను మర్చిపోయే నేతలకు కర్ర కాల్చి వాత పెట్టటం పెద్ద విషయం కాదన్నది మరోసారి నిరూపితమైంది.

సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అండ్ కో కు దేశ ప్రజలు ఒకలాంటి షాకిస్తే.. తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. అందరి అంచనాలకు మించినట్లుగా ఫలితాలు నమోదవుతున్నాయి. మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు కలిపి ఏకంగా ఇప్పటివరకు (మధ్యాహ్నం 1.30 గంటల వేళకు) ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా.. 155 స్థానాల్లో అధిక్యతలో దూసుకెళుతోంది. ఇక.. వైసీపీ విషయానికి వస్తే 14 స్థానాల్లో తన అధిక్యతను ప్రదర్శిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో జనసేన హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. ఈ పార్టీ గెలిచే సీట్ల మీద ఉన్న అంచనాలకు భిన్నంగా తన అధిక్యతను ప్రదర్శించటం. జనసేన మొత్తం 21 స్థానాల్లోనే తన అభ్యర్థులను బరిలోకి దింపింది. జనసేనకు కేటాయించే సీట్లలో అత్యధికం వైసీపీ గెలుస్తుందన్న ప్రచారం సాగటం తెలిసిందే. తీరా.. ఈవీఎంలను ఓపెన్ చేసిన తర్వాత చూస్తే.. ఫలితాల సరళి భిన్నంగా ఉంది.

జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో 21 స్థానాలు అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. ఇప్పటివరకు అధిక్యతలో ఉన్న స్థానాలు విజయం దిశగా పయనిస్తే.. జనసేన స్ట్రైకింగ్ రేట్ 100 శాతంగా ఉంటుంది. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఇలాంటి ఫీట్ సాధించటం అపూర్వం.. చారిత్రకంగా చెప్పాలి. ఒకవేళ.. ఒకట్రెండు సీట్లలో తేడా కొట్టినా దాని స్ట్రైకింగ్ రేట్ 95 శాతానికి మించే ఉంటుంది. జనసేన సాధిస్తున్న ఈ స్ట్రైకింగ్ రేట్ ఎంత అరుదైనదన్న విషయానికి వస్తే.. కూటమిలోని కీలకమైన తెలుగుదేశం పార్టీ గణాంకాల్ని చూస్తే అర్థమవుతుంది.

తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పార్టీ ఇప్పుడు 131 స్థానాల్లో విజయం సాధించింది. అంటే దాని స్ట్రైకింగ్ రేట్.. 91 శాతం. అదేసమయంలో జనసేన స్ట్రైకింగ్ రేట్ 100 శాతం. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీచేస్తే ఆ పార్టీ ఎనిమిది స్థానాల్లో (ఒకస్థానంలో గెలిచింది) అధిక్యతలో ఉంది. ఈ లెక్కన చూస్తే.. ఆ పార్టీ స్ట్రైకింగ్ రేట్ 80 శాతం. ఏపీలో బీజేపీకి ఎలాంటి ఇమేజ్ లేదన్న వేళ.. ఏకంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్ని.. మూడు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవటం సామాన్యమైన విషయం కాదన్నది మర్చిపోకూడదు. ఎన్నికలకు ముందు.. ఎన్నికల వేళలోనూ పవన్ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలపై జరిగిన చర్చ నేపథ్యంలో జనసేన అదరగొట్టే స్ట్రైకింగ్ రేట్ ను ప్రదర్శించిందని చెప్పాలి. ఏమైనా.. పవన్ బ్రో ఇరగదీశారుగా.

Tags:    

Similar News