పెరుగుతున్న కారు ప్రమాదాలు.. హైదరాబాద్ స్థానం ఎంతంటే..?

ఇతర ఏ కారణాలు అయినా కూడా కారు ప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని భయపెడుతున్నాయి.

Update: 2024-12-13 14:30 GMT

హైదరాబాద్‌లో రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా కారు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిర్లక్ష్యం డ్రైవింగ్ కావచ్చు.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు.. ఇతర ఏ కారణాలు అయినా కూడా కారు ప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని భయపెడుతున్నాయి.

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. సాఫ్ట్‌వేర్ కానీ.. ఇతరత్రా అభివృద్ధిలో నగరం దూసుకెళ్తోంది. ప్రపంచానికి ఓ ఐకానిక్ నగరంగా ఎదుగుతోంది. అదే క్రమంలో ఉద్యోగ, ఉపాధికి కూడా ఇక్కడ ఢోకా లేదు. ఉపాధి పెరుగుతుండడంతో అదే స్థాయిలో ఉద్యోగులు కార్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కార్ల సంఖ్య కూడా ప్రధాన నగరాలను దాటి ఇక్కడ కనిపిస్తోంది.

తాజాగా.. ప్రముఖ వాహన బీమా సంస్థ అకో ‘యాక్సిడెంట్ ఇండెక్స్ 2024’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌లోనే అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు వెల్లడించింది. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీ, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు ఉన్నట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా కూడా 78 శాతం ప్రమాదాలు మెట్రో నగరాల్లోనూ సంభవిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. బెంగళూరులో 45శాతం, ఢిల్లీలో 13 శాతం, ముంబయిలో 12 శాతం ప్రమాదాలు గుంతల కారణంగా సంభవిస్తున్నాయని పేర్కొంది. 2022లో అత్యధిక కారు ప్రమాదాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. కానీ.. ఇప్పుడు ఆ స్థానం హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో 46శాతం కార్లు తక్కువ. కానీ.. గత రెండేళ్లలో ఇక్కడ ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగించే పరిణామం. హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్ అత్యంత ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతంగా నిలిచింది. మియాపూర్ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని బొమ్మనహళ్లి, ఢిల్లీలోని నోయిడా, పుణెలోని మరుంజి, ముంబయిలోని మిరారోడ్, చెన్నైలోని మెడపక్కం ప్రాంతాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది.

Tags:    

Similar News