హైదరాబాద్ లో ఎంట్రీ ఇవ్వనున్న పాడ్ ట్యాక్సీ.. ఇదెలా పని చేస్తుంది?

నత్తను తలపించే వేగంతో.. కోట్లాది పని గంటలు రోడ్ల మీద ట్రాఫిక్ జాం కారణంగా నష్టపోతున్న వేళ.. వాటికో పరిష్కారంగా పాడ్ ట్యాక్సీలను చెబుతున్నారు

Update: 2025-01-20 11:30 GMT

మహానగరాలకు ఉండే సాధారణ సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ జాం. నత్తను తలపించే వేగంతో.. కోట్లాది పని గంటలు రోడ్ల మీద ట్రాఫిక్ జాం కారణంగా నష్టపోతున్న వేళ.. వాటికో పరిష్కారంగా పాడ్ ట్యాక్సీలను చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్ కు ఈ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇంతకూ పాడ్ ట్యాక్సీ అంటే ఏమిటి? ఇదెలా పని చేస్తుంది? లాంటి వివరాల్ని చూస్తే ఆసక్తికరంగా ఉంటాయి.

మూడేళ్ల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ఈ పాడ్ ట్యాక్సీని తొలుత అత్యంత రద్దీ ప్రాంతాలైన రెండు మార్గాల్లో తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో ఒకటి రాయదుర్గం - కొండాపూర్ కాగా మరొకటి రాయదుర్గం - నాలెడ్జ్ సిటీ. ఈ రెండింటి మధ్య దూరం 14.8 కి.మీ. మొత్తం 55 స్టాప్ లు ఏర్పాటు చేస్తారు. గరిష్ఠ వేగం గంటకు 40కి.మీ. మాత్రమే.

ఇంతకు ఈ పాడ్ ట్యాక్సీ అంటే ఏమిటి? అన్నది చూస్తే.. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఆఫీసులకు వెళ్లే వ్యవస్థను రూపొందించటమే. భారీ టవర్లు ఉండే భవనాల్లోకి ప్రత్యేక మార్గాల్లో నేరుగా వెళ్లటం ద్వారా.. రోడ్ల మీద ట్రాఫిక్ ను తగ్గించినట్లు అవుతుంది. పాడ్ ట్యాక్సీని మరింత వివరంగా చెప్పాలంటే.. ‘పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ గా వ్యవహరిస్తుంటారు.

పాడ్ కార్ బ్యాటరీ లేదంటే విద్యుత్తుతో పని చేస్తుంది. పర్యావరణహితంగా ఉండే ఈ రవాణా వ్యవస్థలో 6-8 మంది ప్రయాణించొచ్చు. వీటిలో డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు ఇందులో కూర్చున్నంతనే.. తాము వెళ్లాలనుకునే ప్లేస్ ను ఎంచుకోవటానికి టచ్ ప్యాడ్లు (లిఫ్టులో ఫ్లోర్ బటన్ల మాదిరి) ఉంటాయి. వీటి ద్వారా ట్రాఫిక్ రద్దీ వేళల్లో గంటకు 10 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంది. రోజులో ఈ సంఖ్య లక్ష మంది వరకు ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ముంబయిలోని బాంద్రా -కుర్ల కాంప్లెక్స్ మధ్య పాడ్ కార్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. గ్రేటర్ నోయిడా నుంచి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు రూ.810 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. ఐటీ కారిడార్ లో వీటిని ఏర్పాటు చేయటం ద్వారా పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపటంతో పాటు.. ట్రాఫిక్ జాంలకు చెక్ పెట్టే వీలుంది. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ లోని రెండు ప్రాంతాల్లో వీటిని నడిపేందుకు రూ.1480 కోట్ల అంచనాలను సిద్ధం చేశారు.దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది.

ఈ నెలాఖరులోపు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్ ను ప్రభుత్వానికి సమర్పించి.. అనుమతులు.. నిధులను కోరనున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేసేలా ఈ పాడ్ ట్యాక్సీలను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎలివేటర్ కారిడార్ ను 8.8కిలోమీటర్ల దూరాన్ని రూ.880 కోట్ల అంచనాతో నిర్మిస్తారు.

ఈ కారిడార్ మెట్రో - ఐటీసీ కోహినైూర్ - నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉంటుంది. ఈ కారిడార్ లో మొత్తం 28 స్టాప్ లు ఉంటాయి. రెండోది రూ.600 కోట్ల అంచనాతో ఆరు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారు. ఈ కారిడార్ లో మొత్తం 27 స్టాప్ లు ఉంటాయి. రాయదుర్గం మెట్రో-టెక్ మహీంద్రా - హైటెక్ సిటీ, కొండాపూర్ మధ్యలో నడవనుంది. నిజానికి ఈ పాడ్ టాక్సీ వ్యవస్థను గత ప్రభుత్వమే తెర మీదకు తీసుకొచ్చింది. కాకుంటే.. ఆ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోలేదు. అప్పటి ప్రభుత్వం అల్ట్రా పీఆర్టీ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పినా.. అదేమీ కార్యరూపం దాల్చలేదు. రేవంత్ సర్కారు మీద ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా హైదరాబాద్ మహానగర రూపురేఖలతో పాటు.. ట్రాఫిక్ జాంలకు చెక్ పెట్టాలని భావిస్తోంది.

Tags:    

Similar News