బావర్చీ బిర్యానీలో బల్లి.. తర్వాతేమైందంటే?

Update: 2023-12-03 03:35 GMT

హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ అన్నంతనే గుర్తుకు వచ్చే వాటిల్లో ప్యారడైజ్.. బావర్చీ.. షాగోస్.. పిస్తా హౌస్.. మైఫిల్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వస్తాయి. హైదరాబాద్ మహానగరంలో సందుకో నాలుగైదు బిర్యానీ సెంటర్లు ఇప్పుడైతే వచ్చాయి కానీ.. పాతికేళ్ల క్రితం పసందైన బిర్యానీ తినాలంటే కొన్ని చోట్లకే వెళ్లాల్సి వచ్చేది.

అలాంటి కోవలోకే వస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చీ బిర్యానీ. తాజాగా ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న ఒకరికి బిర్యానీతో పాటు.. బల్లి కూడా దర్శనమివ్వటంతో షాక్ తిన్నారు. అంబర్ పేటలోని డీడీ కాలనీకి చెందిన వివ్వ ఆదిత్య అనే వ్యక్తి ఆన్ లైన్ లో బావర్చీ బిర్యానీని జొమోటో యాప్ ద్వారా బుక్ చేశారు. ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ వచ్చిన తర్వాత.. దాన్ని తినేందుకు సిద్ధమైన ఆదిత్య కుటుంబ సభ్యులు బిర్యానీ పార్సిల్ లో బల్లి కనిపించటంతో అవాక్కు అయ్యారు.

ఆ వెంటనే.. బావర్చీ బిర్యానీ హౌస్ ను సంప్రదించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆగ్రహించిన బాధితులు ఆందోళన చేపట్టారు. పేరున్న రెస్టారెంట్లలోనూ తరచూ ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని అల్ఫా హోటల్ లో బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్ కు కూడా ఇదే తరహాలో సేవా లోపం చోటు చేసుకోవటం.. దీనిపై ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవటం తెలిసిందే.

Tags:    

Similar News