భాగ్యనగరంలో బెగ్గింగ్‌ మాఫియా.. రోజుకు ఎంత వసూలు చేస్తున్నారంటే!

దేశంలో కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, చిన్న పిల్లలను, మహిళలతో బెగ్గింగ్‌ చేయిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2023-08-18 09:30 GMT

దేశంలో కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, చిన్న పిల్లలను, మహిళలతో బెగ్గింగ్‌ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నపిల్లలను కిడ్నాప్‌ చేసి మహిళల చేతికి ఇచ్చి భిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. ఇలా వారు అడుక్కుని తెచ్చిన డబ్బులను బెగ్గింగ్‌ మాఫియా తీసేసుకుని కోట్లాది రూపాయలు గడిస్తోంది. మరోవైపు భిక్షాటన చేసేవారిని చిత్రహింసలు పెడుతూ.. వారి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు.

ఇప్పుడు ఇదే కోవలో హైదరాబాద్‌ లో భారీ బెగ్గింగ్‌ మాఫియాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్, కేబీఆర్‌ పార్క్‌ వద్ద 23 మంది యాచకులను అరెస్ట్‌ చేశారు. వీరితో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్‌ మాఫియా నిర్వాహకుడు అనిల్‌ పవార్‌ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 మంది బిచ్చగాళ్లను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకుడు అనిల్‌ పవార్‌ పై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అప్పగించారు.

బెగ్గింగ్‌ మాఫియాకు సంబంధించి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగ్గింగ్‌ నిర్వాహకుడు అనిల్‌ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నాడు.

ఇలా యాచకులందరి నుంచి రోజుకు రూ.4,500 నుంచి రూ.6,000 వరకు తీసుకుంటున్నాడు. దీనికి ప్రతిగా ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ.200 మాత్రమే కూలిగా చెల్లిస్తున్నాడు. ఎండల్లో, వానల్లో, చలి కాలంలో వృద్ధులు భిక్షాటన చేసి తెచ్చిన డబ్బును అనిల్‌ స్వాహా చేస్తున్నాడు. వారికి మాత్రం ముష్టి విదిల్చినట్టు రూ.200 మాత్రమే ఇస్తున్నాడు.

ఈ క్రమంలో సిగ్నల్స్‌ వద్ద భిక్షాటనతో ఇబ్బందులకు గురైనవారు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఈ బెగ్గింగ్‌ రాకెట్‌ను చేధించారు. మరికొద్ది రోజుల పాటు నగరంలో ఈ డ్రైవ్‌ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా వృద్ధులు భిక్షాటన ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు? సిటీలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనిల్‌ పవార్‌ తో పాటు ఈ బెగ్గింగ్‌ మాఫియాలో పాత్రధారులు, సూత్రధారులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలా పలు కోణాల్లో కేసు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News