అయోద్య రామాలయ స్ట్రక్చరల్ డిజైన్ లో హైదరాబాదీ
జనవరి 22న మధ్యాహ్న వేళ రామాలయంలో రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం మరో 17 రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 22న మధ్యాహ్న వేళ రామాలయంలో రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. శిల్పులు ప్రాణం పెట్టినట్లుగా పని చేశారు.ఆలయాన్ని ఒక్క ఇనుప చువ్వ కూడా లేకుండా అంతా రాతితోనే నిర్మించారు.
అత్యద్భుత డిజైన్ లో అందరిని అమితంగా ఆకర్షిస్తున్న రామాలయ నిర్మాణానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. అయోధ్య ఆలయ స్ట్రక్చరల్ డిజైన్ రూపొందించిన టీంలో హైదరాబాద్ కు చెందిన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ప్రదీప్ హైదరాబాద్ వాసి. నాలుగేళ్లుగా రామాలయ నిర్మాణంలో ఆయన టీం ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానే పాల్గొంది. స్ట్రక్చరల్ డిజైన్ తో పాటు. పునాదుల నిర్మాణంలోనూ ఆయన టీం శ్రమించింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతల్ని ఉత్తరాఖండ్ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ) కు అప్పజెప్పారు. డిజైన్ నిర్మాణ వ్యయం.. ఇతర అంశాలు టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ చూసుకుంది. నిర్మాణ పనుల్ని ఎల్ అండ్ టీ చేపట్టింది.
అయోధ్య రామాలయం ఎలా ఉండాలి? అనే దానిపై కేంద్రం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ విభాగాల అధికారులు.. సోంపురా వంశస్థుల ప్రతినిధులు.. ఎల్ అండ్ టీ ఇంజినీర్లు.. టాటా కన్సల్టెన్సీ అధికారులు.. సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ లు పలుమార్లు చర్చలు జరిపి ఫైనల్ చేశారు. ఈ సందర్భగా పునాదుల నుంచి స్తంభాల వరకు ఎక్కడా ఇనుము వాడకూడదని నిర్ణయించారు. అందుకు తగ్గట్లు డిజైన్ చేశారు. డిజైన్ కోసం నాలుగు నెలల పాటు శ్రమించటం గమనార్హం.భారీ భూకంపాలు వచ్చినా తట్టుకునేలా చేయటంతో పాటు..వెయ్యేళ్లకు ఢోకా లేని రీతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.