హైదరాబాద్... ఆంధ్ర రాజధానిగా చివరి రోజు!
హైదరాబాద్... ఈ పేరు చెప్పగానే ఊర్ల నుంచి బస్సులు ఎక్కి, కార్లెక్కి, ట్రైన్లు ఎక్కి కదిలి వస్తున్న ప్రజానికం కనిపిస్తుంటారు.
హైదరాబాద్... ఈ పేరు చెప్పగానే ఊర్ల నుంచి బస్సులు ఎక్కి, కార్లెక్కి, ట్రైన్లు ఎక్కి కదిలి వస్తున్న ప్రజానికం కనిపిస్తుంటారు. వీరంతా సంక్రాంతి వంటి పండుగల వేళ భాగ్యనగర రోడ్లన్నీ బోసిపోయేలా చేసేస్తుంటారు. ఏపీ ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న బంధం ప్రత్యేకం. అయితే నిన్నటివరకూ సొంతిల్లు, ఉమ్మడి ఇల్లు అయిన హైదరాబాద్ రేపటి నుంచి ఆంధ్రులకు అద్దె ఇల్లు కాబోతోందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు పదేళ్ల గడువు ఒక్క రోజులోనే ముగుస్తుంది. ఇదే క్రమంలో నగరంతో ఏపీ ప్రజల "సొంత" బంధం కూడా ముగుస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. జూన్ 02 - 2024 న, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాజధానిగా నిలిపివేయబడుతుంది. ఫలితంగా... అన్ని కార్యాలయాలు దాని స్వంత రాష్ట్రానికి మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. 2014 నుండి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండవలసి ఉంది. అయితే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పలు రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ఏపీలో రాజధాని లేకపోయినా 2016 నాటికే 90శాతం కార్యాలయాలు ఏపీకి తరలించేశారనే కామెంట్లు వినిపించాయి! అప్పట్లో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి!
ఈ క్రమంలో మిగిలిన సుమారు 10 శాతం కార్యాలయాలు ఇప్పటికీ హైదరాబాద్ నుండి పని చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జూన్ 02 గడువుకు వారం రోజుల ముందు.. అన్ని భవనాలను ఖాళీ చేయమని తెలంగాణ ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని చివరిగా కర్నూలుకు మార్చారు.
వాస్తవానికి 2014లో పార్లమెంట్ లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ఫలితంగా... రేపటి నుంచి తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని. అయితే... విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు మాత్రం ఇంకా జరగలేదనే విషయం ఇక్కడ అత్యంత ముఖ్యం!
కాగా... ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నాళ్లు పొడిగించాలనే డిమాండ్లు ఏపీ నుంచి ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంపై ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా పునరాలోచన చేసే అవకాశం కేంద్రంలోని పెద్దలకు ఉంటుందా.. లేక, హైదరాబాద్ తో ఆంధ్రుల ఆత్మీయ బంధం కొనసాగినా.. అధికారిక సంబంధం మాత్రం ఇప్పటితో ముగిసినట్లేనా అనేది వేచి చూడాలి!