గ్రేటర్ వాసులది భయమా.. అభిమానమా..!
కట్ చేస్తే.. అనూహ్యంగా గ్రేటర్ సిటీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం కారు జోరు మరింత ఊపం దుకుంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చిత్రమైన ఫలితం వచ్చింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. నీళ్లు పారించామని చెప్పుకొన్న జిల్లాల్లోనూ.. దళిత బంధు పరుగులు పెట్టిందని.. చెప్పిన జిల్లాల్లోనూ బీఆర్ ఎస్ ఓటమి పాలైంది. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కారు జోరుకు ప్రజలు సెడన్ బ్రేకులు వేశారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జోరు పెరిగింది.
కట్ చేస్తే.. అనూహ్యంగా గ్రేటర్ సిటీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం కారు జోరు మరింత ఊపం దుకుంది. గత ఎన్నికల కంటే కూడా.. ఈ రెండు జిల్లాల్లో పార్టీ విజయం దక్కించుకుంది. గ్రేటర్‌లోని దా దాపు అన్ని స్థానాల్లోనూ బీఆర్ ఎస్ పుంజుకుంది. విజయం సాధించింది. వాస్తవానికి టీడీపీ సానుభూతి పరులు, సెటిలర్లు.. ఈ రెండు జిల్లాల్లో నే ఎక్కువగా ఉన్నారు. పైగా కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి నియో జకవర్గాల్లోనూ ఉన్నారు.
దీంతో ఎలానూ టీడీపీ పోటీ చేయడం లేదు కనుక.. ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆ ఓట్లు బీఆర్ ఎస్‌కే పడ్డాయి. చివరకు కూకట్‌పల్లిలో ఏపీ పార్టీ జనసేన పోటీ చేసినా.. ప్రజలు ఆ పార్టీకి కూడా సానుకూలత చూపించలేక పోయారు. ఇక్కడ కూడా మాధవరం కృష్ణారావు విజయం దక్కించుకున్నారు. అంటే .. మొత్తంగా.. గ్రేటర్ సహా రంగారెడ్డి వాసులు బీఆర్ ఎస్‌కు అనుకూలంగా ఉన్నారనేది స్పష్టమైంది.
దీనిని చూస్తే.. గ్రేటర్ వాసులు భయపడ్డారనే వాదన వినిపిస్తోంది. తమ మనసులో బీఆర్ ఎస్‌కు వేయాలని లేకపోయినా.. ఏమో రేపు ఆ పార్టీనే అధికారంలోకి వస్తే.. తమ వ్యాపారాలు, వ్యవహారాలకు ఇబ్బందులు రావొచ్చని భావించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. అందుకే గుండుగుత్తగా.. ఇక్కడి ప్రజలు బీఆర్ ఎస్ వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు.
అభిమానం ఉన్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో అయితే.. అభివృద్ధి లేదనేది ఇక్కడి వారు చెబుతున్న మాట. చిన్నపాటి వర్షానికే రోడ్లు నిండిపోవడం.. ట్రాఫిక్ సమస్యలు.. వంటివి వేధిస్తూనే ఉన్నాయి. అయినా.. బీఆర్ ఎస్‌కు జై కొట్టారంటే.. కేవలం మనసులో ఎక్కడో భయం ఉందని అంటున్నారు.