వైసీపీ నేతకు హైడ్రా షాక్.. అక్రమ నిర్మాణం కూల్చివేత
ఒకవిధంగా హైదరాబాద్‌కు హైడ్రాను రక్షణ కవచంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
హైడ్రా అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వెలిసిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా.. చెరువులు, కుంటల భద్రతే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా రోజురోజుకూ బలోపేతంగా మారుతోంది. ఇప్పటికే పలు రకాల అధికారాలను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. భవిష్యత్తుల్లోనూ ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఒకవిధంగా హైదరాబాద్‌కు హైడ్రాను రక్షణ కవచంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
గత జూన్ నెలలో ఏర్పాటైన జీహెచ్ఎంసీ పరిధితోపాటు హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు పరిధిని విస్తరించారు. ఏర్పాటు నుంచి హైడ్రా తన పనిలో ఎక్కడా తగ్గడం లేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి భరతం పడుతూనే ఉంది. ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది. వందలాది ఎకరాల భూమిని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించింది.
తాజాగా.. హైడ్రా వైసీపీ నేతకు షాక్ ఇచ్చింది. వైసీపీ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్‌పల్లిలోని నల్లవాగును శిల్పా మోహన్ రెడ్డి కబ్జాచేసి వెంచర్ ఏర్పాటు చేశారని అధికారులు గుర్తించారు. దాంతో సర్వే చేపట్టిన అధికారులు.. వెంచర్‌లోని ఆక్రమణలను కూల్చివేశారు. దాంతో ఏ స్థాయిలో ఉన్న వారిని కూడా హైడ్రా వదిలిపెట్టబోదంటూ మరోసారి ఇండికేషన్స్ ఇచ్చారు.
ఇప్పటికే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసి సంచలనంగా మారింది హైడ్రా. ఆ తరువాత జయభేరి అధినేత, సినీనటుడు మురళీమోహన్‌కు సైతం నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే చాలా మంది నేతలకు, వివిధ రంగాలకు చెందిన వారికి నోటీసులు వెళ్లాయి. దాంతో వారి నుంచి వచ్చిన స్పందన మేరకు హైడ్రా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది స్వతహాగా తమ అక్రమ కట్టడాలను తొలగించారు. తాజాగా.. వైసీపీ నేత వెంచర్‌లో ఈ అక్రమ కట్టడాలను తొలగించడంతో.. తదుపరి ఎవరికి నోటీసులు వస్తాయా అని అక్రమార్కుల్లో భయం కనిపిస్తోంది.