జనసేనకు 24 సీట్లు... లైన్ లోకి వచ్చిన హైపర్ ఆది!
అవును... జనసేన సానుభూతిపరుడిగా పేరు సంపాదించిన హైపర్ ఆది తాజాగా ఆ పార్టీకి 24 సీట్లు మాత్రమే ఇవ్వడంపై స్పందించారు.
టీడీపీ - జనసేన కూటమిలో భాగంగా అభ్యర్థుల తొలిజాబితాగా 118 స్థానాలను ప్రకటించారు చంద్రబాబు. ఈ 118లో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఇక మొత్తం 175 లోనూ జనసేనకు 24 స్థానాలు ఇచ్చారు. దీంతో రచ్చ రచ్చ మొదలైంది! కాపులకు ఇది వెన్నుపోటని ఒకరంటే... ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంతకాలం జనసేన జెండా మోస్తూ పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టుకుని, ఎకరాలు అమ్ముకున్న నేతల ఆవేదనకైతే అంతే లేదు!
ఈ విషయంలో ఎవరైనా వారిని వారించే ప్రయత్నం చేస్తుంటే ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి! సుమారు 10 ఏళ్లుగా.. ప్రధానంగా గత ఐదేళ్లుగా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని, కార్యకర్తలనూ కాపాడుకుంటూ ఉన్నామని.. అందుకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశామని.. ఉన్న పొలాలు అమ్ముకున్నామని.. ఇంట్లో బంగారం అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం పార్టీకోసం అన్ని రకాలుగానూ తీవ్రంగా కష్టపడినవారు!! ఈ సమయంలో హైపర్ ఆది స్పందించారు.
అవును... జనసేన సానుభూతిపరుడిగా పేరు సంపాదించిన హైపర్ ఆది తాజాగా ఆ పార్టీకి 24 సీట్లు మాత్రమే ఇవ్వడంపై స్పందించారు. ఇందులో భాగంగా... జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై ఇంతకాలం జెండా మోసిన కార్యకర్తలు అదే జెండాను రోడ్డుపై వేసి తగలబెడుతున్నారని అన్నారు. గత పదేళ్లుగా ఎలాంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని అన్నారు.
అలాంటి పవన్ కల్యాణ్ గురించి శత్రువులు మాట్లాడినట్లు జనసైనికులే మాట్లాడుతుంటే తనకు చాలా బాధనిపించిందని అన్నారు. 2019లో ఆయనను కూడా గెలిపించుకోలేని మనం... ఈ రోజు 24 టిక్కెట్లు మాత్రమే ఇవ్వడంపై స్పందించడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయితేనే బయటకు రాని జనం ఉండగా... పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా కూడా మరో ఆలోచన లేకుండా రెండో రోజు బయటకు వచ్చిన వ్యక్తి పవన్ అని కొనియాడారు.
అలాంటి గొప్ప మనసున్న మనిషి గురించి మాట్లాడుతూ... కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టాడని, ప్యాకేజీ స్టార్ అని అంటున్నారని చెప్పిన ఆది... డబ్బుల కోసం కులాన్ని తాకట్టుపెట్టే వ్యక్తా పవన్ కల్యాణ్... డబ్బుకు అమ్ముడుపోతాడా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జనసైనికులకు సరికొత్త క్లాస్ పీకర్ హైపర్ ఆది. ఇందులో భాగంగా అభిమానించడం అంటే... తమకు నచ్చిన పని చేస్తే జై కొట్టడం, నచ్చని పని చేస్తే బై చెప్పడం కాదని తెలిపారు.
ఇదే సమయంలో ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానించడం అంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు హైపర్ ఆది ఒక సూచన చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఒక్క టిక్కెట్ కూడా ఆశించకుండా పవన్ కల్యాణ్ సపోర్ట్ చేశారనే విషయం మరిచిపోవద్దని అన్నారు. ఇదే సమయంలో జనసైనికులను ఉద్దేశించి కూడా పవన్ ఎన్నో సూచనలు చేశారని అన్నారు. ఇందులో భాగంగా అవసరానికి ఆదుకున్నామని టీడీపీ కార్యకర్తలను తక్కువగా కానీ తప్పుగా కానీ మాట్లాడోద్దని తెలిపారు!