నేను టీడీపీలోనే.. రాధా క్లారిటీ!
ఈ పరిణామం తర్వాత.. మరో ప్రధాన వికెట్ వంగవీటి రాధా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం తెరమీదికి వచ్చింది.
ఏపీ రాజకీయాల్లో విజయవాడ రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ఇక్కడ నుంచి అనేక మంది నాయకులు జంపింగులు చేయడం తెలిసిందే. తాజాగా టీడీపీ నుంచి కమ్మ వర్గానికి చెందిన ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి జంప్ చేశారు. ఈ పరిణామం తర్వాత.. మరో ప్రధాన వికెట్ వంగవీటి రాధా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం తెరమీదికి వచ్చింది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధా. టీడీపీలోనే ఉన్నా.. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.
పైగా ఆయన టీడీపీ నేతలతో కంటే.. వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతోనే ఎప్పుడూ రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యానికి తోడు.. రాధా ఇటీవల తన తండ్రి రంగా వర్ధంతిని పురస్కరించుకుని కాశీకి వెళ్లి. పిండ ప్రదానం చేశారు. అక్కడకు తోడుగా కొడాలి నాని కూడా వెళ్లారు. దీంతో ఇక, వచ్చే ఎన్నికల్లో రంగా వారసుడు రాధా.. పూర్తిగా వైసీపీలోకి వస్తారని అనుకున్నారు.
మరోవైపు.. ఈ ప్రచారానికి సమాంతరంగా.. వైసీపీలోనూ కొన్ని సంకేతాలు వచ్చాయి. విజయవాడ సెంట్ర ల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్నును పక్కన పెట్టారు. నియోజకవర్గంతో సంబంధం లేని వెలం పల్లి శ్రీనివాస్‌ను తీసుకువచ్చారు. కానీ, దీని వెను కవ్యూహం.. రాధా కనుక పార్టీలోకి వస్తే.. వెలంపల్లిని కూడా చివరి నిముషంలో తప్పించి.. రాధాకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశం వైసీపీకి ఉందని ప్రచారం జరిగింది. కానీ, తీరా చూస్తే.. రాధా రాలేదు.
ఇప్పుడు బాంబు లాంటి వార్త పేల్చారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని వంగవీటి రాధా వ్యాఖ్యా నించారు. అంతేకాదు.. మీరే రావాలంటూ.. ప్రస్తుతం వైసీపీలో గుస్సాగా ఉన్న విజయవాడ వైసీపీ ఇంచా ర్జ్ బొప్పన భవకుమార్‌ను రాధా ఆహ్వానించినట్టు ప్రచారంలోకి వచ్చింది. బొప్పన ను ఆహ్వానించడం ఎలా ఉన్నా.. తాను మాత్రం టీడీపీని వీడడం లేదన్న సంకేతాలు ఇచ్చారు రాధా.
ఇప్పటి వరకు రాధా రాజకీయం ఎలా ఉన్నా.. ఇప్పుడు కాపు నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో జనసేన-టీడీపీ కూటమి.. ఆయనను వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అది ఏ రూపంలో ఉంటుందో తెలియదు కానీ.. రాష్ట్ర స్థాయిలో ఎలివేషన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.