కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఐఏఎస్.. వైసీపీ పరిశీలన!
ఉమ్మడి కృష్నాజిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన మైనారిటీ అధికారి ఇంతియాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పిం చేందుకు వైసీపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
వైసీపీలో టికెట్ల కేటాయింపు పర్వం సంచలనాల దిశగా అడుగులు వేస్తోంది. ఊహించిన నాయకులు పక్క కు జరిగిపోతుండగా.. ఊహించని నాయకులు తెరమీదికి వస్తున్నారు. అదేసమయంలో తమకు పట్టున్న నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు బదిలీ అవుతున్నారు. దీంతో వైసీపీలో ఏ నిముషానికి ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా కర్నూలు పార్లమెంటు స్థానానికి జరుతున్న మార్పు మరో సంచలనంగా మారింది.
కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుతం ఏపీ వక్ఫ్‌బోర్డు కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి కృష్నాజిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన మైనారిటీ అధికారి ఇంతియాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పిం చేందుకు వైసీపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆయన కృష్ణా సహా కర్నూలులోనూ పనిచేశారు. దీనికి తోడు కర్నూలులో మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఇక్కడ ముస్లింలు సుమారు 2 లక్షల మందికి పైగాన ఉన్నారని సమాచారం.
దీంతో మైనారిటీ వర్గాలకే దాదాపు పార్టీలు అవకాశం కల్పిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే కర్నూలు ఎమ్మెల్యే సీటును మైనారిటీ ముస్లిం నాయకుడికి ఇచ్చింది. ఇక, ఇప్పుడు మరో సంచలన ప్రయోగం దిశగా అడుగులు వేయడం గమనార్హం. మైనారిటీ అధికారి అయిన.. ఇంతియాజ్‌ను కర్నూలు ఎంపీగా దింపితే.. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందనే వాదన ఉంది. ఇక, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. 2019కి ముందు వరకు రెడ్డి సామాజిక వర్గమే ఆదిపత్యం ప్రదర్శించింది.
ఇక, దీనికి బ్రేకులు వేస్తూ. 2019లో జగన్ తొలిసారి బీసీ నేత, సంజీవ కుమార్‌కు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సంజీవ కుమార్‌ను పక్కన పెట్టిన జగన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆలూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇచ్చారు. ఆయన పోటీ చేయనని చెబుతూ.. సైకిల్ ఎక్కేసేందుకు రెడీ అయ్యారు. దీంతో కర్నూలు స్థానం వైసీపీకి ఎంప్టీ అయింది. తాజాగా ఇంతియాజ్‌కు అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. కర్నూలు స్తానం నుంచి పోటీ చేసే తొలి మైనారిటీ కాయడం ఖాయం... అంటున్నారు పరిశీలకులు.