పవన్ కోరుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కు గ్రీన్ సిగ్నల్
సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఉండే అధినేతల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కనిపిస్తారు.
సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఉండే అధినేతల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కనిపిస్తారు. సినీ నటుడిగా ఆయనకున్న ప్రజాదరణ ఎంతన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వేళలో ఆయన మీద వచ్చినన్ని విమర్శలు ఇంకెవరి మీదా రాలేదనే చెప్పాలి. అయితే.. అదంతా ఆయన సమర్థత తమకెక్కడ ఇబ్బందులకు గురి చేస్తుందన్న ముందస్తు జాగ్రత్తల్లో అదే పనిగా టార్గెట్ చేసేవారు. పార్ట్ టైం పొలిటిషియన్ అంటూ విరుచుకుపడేవారు. కానీ.. ఎప్పుడైతే చేతికి అధికారం వచ్చిందో.. ఆ క్షణం నుంచి పవన్ పడుతున్న శ్రమను చూశాక.. అసలు రాజకీయ నాయకుడు ఎంతలా పని చేయాలన్న విషయం చాలామందికి అర్థమవుతోంది.
పవన్ పడుతున్న కష్టం మిగిలిన మంత్రులకు సైతం విస్మయానికి గురి చేస్తోంది. తక్కువ కాలంలో ఆయన తన శాఖలకు చెందిన అధికారులతో నిర్వహిస్తున్న వరుస రివ్యూలు.. సమస్యల మీద అవగాహనతో పాటు.. వాటిని పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యల మీద ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకంటూ ప్రత్యేకమైన టీం కోసం ఆలోచించిన పవన్.. కేరళలో పని చేస్తున్న యువ ఐఏఎస్ అధికారి క్రిష్ణ తేజను ఎంపిక చేసుకోవటం తెలిసిందే.
నిజాయితీగా.. ముక్కుసూటిగా వ్యవహరించటంతో పాటు.. పని రాక్షసుడిగా పేరున్న ఆ అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని భావించిన పవన్ అందుకు తగ్గట్లే ప్రయత్నం చేశారు. తెలుగువాడైన క్రిష్ణ తేజను కేరళ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీకి పంపేందుకు అక్కడి ప్రభుత్వం ఓకే చెప్పటమే కాదు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఏరికోరి మరీ.. సమర్థుడైన అధికారిని ఏపీకి తెస్తున్న పవన్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పనులు చేయటం ఖాయమంటున్నారు. మొత్తంగా చూస్తే.. తాను చేపట్టిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి తన మార్క్ వేయాలని తపిస్తున్న పవన్.. రోజులో అత్యధిక సమయాన్ని ప్రజాసేవకే వినియోగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాను పని చేయటమే కాదు.. తాను తీసుకున్న నిర్ణయాల్ని అంతే శ్రద్ధతో అమలు చేసే అధికారులను ఏరికోరి తెచ్చుకుంటున్న పవన్ మరెంతలా దూసుకెళతారో చూడాలి.