కృష్ణతేజ ఐఏఎస్.. ఏంటీ ప్రత్యేకత ?!
కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ఐఏఎస్ ను ఎంచుకోవడం విశేషం. దీంతో ఆయన ప్రత్యేకత ఏంటి అని ఉత్కంఠ నెలకొంది.
కృష్ణతేజ ఐఏఎస్. ఏపీలో ప్రస్తుతం ఇది మారుమోగుతున్న పేరు. కొద్ది రోజుల క్రితం జాతీయ అవార్డుతో వార్తల్లోకి ఎక్కిన కృష్ణతేజ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా వస్తుండడం, కేరళలో ఉన్న ఆయనను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు ప్రత్యేకంగా లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులకు ఓఎస్డీలుగా గ్రూప్ వన్ స్థాయి అధికారులు, ఆర్డీఓలను నియమిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ఐఏఎస్ ను ఎంచుకోవడం విశేషం. దీంతో ఆయన ప్రత్యేకత ఏంటి అని ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, పర్యాటకశాఖ డైరెక్టర్‌గా , ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.
కరోనాతో తల్లితండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారుల్లో కలెక్టర్ మామన్‌గా గుర్తింపు పొందారు. కరోనాలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడం గమనార్హం.
2018లో కేరళలో వరదలు అతలాకుతలం చేసినపుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు పేరుతో 48గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
2014 సివిల్స్ పరీక్షలో 66ర్యాంకు సాధించిన కృష్ణతేజ 2015లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ దక్కింది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.