జగన్ టికెట్ ఇవ్వకపోతే ఆ ఎంపీతో ఆడేసుకుంటారుగా...!?

రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని అనుకున్నా కొన్ని సార్లు కొందరికి వచ్చే కష్టాలు చూస్తే పగవారికి కూడా రాకూడదు అని అంటారు

Update: 2024-02-01 07:11 GMT

రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని అనుకున్నా కొన్ని సార్లు కొందరికి వచ్చే కష్టాలు చూస్తే పగవారికి కూడా రాకూడదు అని అంటారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని విషయం చూస్తే ఇపుడు అలాగే ఉంది. ఆయన రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచారు. రెండవ సారి గెలుపు తరువాత నానిలో మార్పు కనిపించింది. జగన్ వేవ్ లో కూడా తాను గెలిచాను అంటే సొంత ఇమేజ్ అనుకున్నారు. దాంతోనే ఆయనకూ పార్టీకి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది.

దాన్ని పెంచేందుకు ఎటూ ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. మొత్తానికి చిలికి చిలికి గాలి వాన అయినట్లుగా బాగుతో కేశినేనికి పొసగలేదు. ఆయంకు టికెట్ ఇవ్వరు అనుకుంటే పోటీగా ఆయన తమ్ముడిని తెచ్చి పెట్టారు. కేశినేని చిన్ని ద్వారా నానికి మానసికంగా ఇబ్బందులు తెచ్చారు. చివరికి ఎంపీగా నాని ఉన్నా చిన్నికే అగ్ర తాంబూలం అని చెప్పి మరీ అవమానించారు.

ఆ అవమానాలను తట్టుకోలేని కేశినేని నాని టీడీపీ నుంచి బయటపడి వైసీపీ వైపు వచ్చారు. వచ్చిన రోజునే మెచ్చినట్లుగా జగన్ ఆయనకు విజయవాడ ఎంపీ సీటుకు ఇంచార్జిని చేశారు. ఇదేదో బాగుందని నాని చూసుకోండి నా పలుకుబడి అంటూ ఒకటికి రెండు అన్నట్లుగా రెట్టించిన ఊపుతో చంద్రబాబునే టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు.

చంద్రబాబుకు చివరి ఎన్నికలు లోకేష్ అసలు ఏమీ పనికిరాడు రాజకీయాలకు అంటూ నాని విమర్శల జడివాన కురిపించారు. ఒక విధంగా బాబుని ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. నిజంగా టీడీపీకి అది ఇబ్బందికరమే అయింది. తాము కాదంటే ప్రత్యర్ధి పార్టీకి వెళ్ళి మరీ ఏడం చేత్తో ఎంపీ టికెట్ తెచ్చారు నాని అని కూడా భావించిన టీడీపీకి కలవరమే రేగింది.

నానికి మించి ఎవరా అని టీడీపీ విజయవాడ ఎంపీ సీటుకు వెతుకులాటలో ఉండగా చావు కబురు చల్లగా అన్నట్లుగా విజయవాడ ఎంపీ సీటుకు నానికి బదులువా వేరే వారిని పరిశీలిస్తున్నారు అన్న ప్రచారం బయటకు వచ్చింది. నాని కుటుంబంలో ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చి నానికి పక్కన పెడుతున్నారు అన్నది ఆ ప్రచార సారాంశం. సరే సామాజిక సమీకరణలలో భాగంగా వైసీపీ ఇలా చేస్తే చేసి ఉండొచ్చు కానీ నానికి కండువా కప్పిన మరుక్షణం ఎంపీవి నీవే అంటూ కలరింగ్ ఇచ్చారు.

ఇపుడు పట్టుమని పదిరోజులు తిరగకుండా ఆయనని కాదని అంటే నానికి అది ఘోర అవమానమే అంటున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది. అత్త తిట్టింది అని కాదు తోడికోడలు నవ్విందని ఏడ్చారు అని. ఇపుడు కేశినేని నాని పరిస్థితి అలాగే అవుతుందని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మొదటే చెప్పేసి ఉండొచ్చు ముందు అందలం ఎక్కించి ఇపుడు కాదు అంటే టీడీపీ నుంచి వచ్చే ర్యాగింగ్ ని ఆయన అసలు భరించలేరు అంటున్నరు

అపుడే తమ్ముడి కేశినేని చిన్ని మొదలెట్టేసారు కూడ. నానికి వైసీపీలోనూ టికెట్ పాయే అంటూ చిన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక నీ రాజకీయ జీవితం ముగిసింది. శేష జీవితం ఇంతే అంటూ చిన్ని గట్టిగానే తగులుకున్నారు. అదే వరసలో బుద్ధా వెంకన్న దేవినేని ఉమా, బోండా ఉమలు లైన్ లోనే ఉంటారు అన్నది నిజం.

మొత్తానికి కేశినేని నానికి ఎంపీ టికెట్ మార్పు ఉండకూడదు అని ఆయన అనుచరులు వేయి దేవుళ్ళను ప్రార్ధిస్తున్నారుట. ఎవరైనా గెలుపు కోసం మొక్కుతారు. ఇపుడు సీన్ చూస్తే కేశినేని నాని టికెట్ కోసమే మొక్కేస్తున్నారు. అంటే ఇది ఇజ్జత్ మే సవాల్ కదా. సో నాని భవిష్యత్తు ఏంటి అన్నది జగన్ చేతిలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జ్రుగుతుందో.


Tags:    

Similar News