ఈ కాషాయం నేతల ఫ్యూచరేంటి ?
ఆయన బీజేపీలో నాలుగు దశాబ్దాలు పైగా ఉంటూ వస్తున్నారు.
ఏపీ బీజేపీలో గత అయిదారేళ్ళుగా ఒక లెక్కలో హవా చలాయించిన ముగ్గురు సీనియర్ నేతలు ఇపుడు సైలెంట్ అయిపోయారు. ఏపీలో ఎన్నికల వేడి వాడిగా ఉన్న టైం లో కూడా వీరు జోరు చేయలేరు. వీరిలో మొదటి వారు బీజేపీని ఏపీ ప్రెసిడెంట్ గా చేసిన సోము వీర్రాజు. ఆయన బీజేపీలో నాలుగు దశాబ్దాలు పైగా ఉంటూ వస్తున్నారు.
ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పార్టీ పట్ల విధేయత ఉంది. కేంద్ర పెద్దలతో నేరుగా సాన్నిహిత్యమూ ఉంది. అన్ని ఉన్నా తాజా ఎన్నికల్లో టికెట్ మాత్రం తెచ్చుకోకపోయారు. నిజానికి ఆయన రాజమండ్రి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయాలనుకున్నారు. అయితే అక్కడ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయడంతో ఆయనకు చెక్ పడింది.
పోనీ అసెంబ్లీకి చేయాలని చూసినా రాజమండ్రి సిటీ సీటు ఇవ్వలేదు, అనపర్తిని ఖాళీ పెట్టి ఉంచారు. దాంతో అక్కడ పోటీ చేసినా పరువు పోతుందని ఆయనే నో చెప్పేశారు అని అంటున్నారు. మొత్తానికి ఆయన ఏపీ బీజేపీ అధినాయకత్వం మీద చాలా కోపంగానే ఉన్నారు అని అంటున్నారు. దాని కంటే ముందు ఆయనకు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు అని అంటున్నారు.
ఇక బీజేపీలో ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఫుల్ సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు. మరో నేత విష్ణు వర్ధన్ రెడ్డి. ఆయన చూస్తే బీజేపీలో ఎపుడూ యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. కానీ ఈసారి ఆయనకూ టికెట్ దక్కలేదు. కదిరి అసెంబ్లీ అయినా లేక హిందూపురం ఎంపీ అయినా పోటీకి ఆయన ఆసక్తి చూపారు కానీ టికెట్ దక్కలేదు. దాంతో ఆయన మౌన ముద్ర దాల్చారు. పైగా ఏపీ బీజేపీ అధినాయకత్వం తో ఆయన దూరం పాటించడం టీడీపీతో పొత్తుకు ఆయన కూడా వ్యతిరేకం అన్న ప్రచారం సాగడంతో సీటు దక్కలేదు అని అంటున్నారు.
అలాగే రాజ్యసభ సభ్యుడిగా నిన్నటిదాకా ఉన్న తాజా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన కూడా బీజేపీ అంటే తానే అన్నట్లుగా ఉత్సాహం చూపించేవారు. కానీ ఇపుడు సీన్ మారింది. ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు పలుకుబడి పెరిగింది. దాంతో పాటు విశాఖ నుంచి ఎంపీ సీటు ఆశిస్తే అది దక్కలేదు. దాంతో ఆయన సైతం మౌనమే నా భాష అని ఉండిపోయారు అని అంటున్నారు.
రేపటి ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే వీరు మళ్లీ నోరు తెరచి ఏపీ బీజేపీ అధినాయకత్వం వైఖరి మీద విమర్శలు చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అపుడు కేంద్ర నాయకత్వం కూడా పార్టీని ప్రక్షాళన చేయడానికి పురంధేశ్వరిని మారుస్తారు అని అంటున్నారు. అలా కాకుండా టీడీపీ కూటమి గెలిస్తే మాత్రం రానున్న అయిదేళ్ళూ వీరికి అజ్ఞాత వాసమే అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే కుదురుకున్న నేతలకే చాన్స్ ఉంటుంది. దాంతో వీరి ఫ్యూచర్ ఏంటి అన్నది వేచి చూడాల్సిందే అని అంటున్నారు.