ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటా ...భట్టి చెప్పేశారుగా..

ఒక వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూంటే ఆయనతో పాటుగా పదమూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

Update: 2023-12-03 11:22 GMT

తెలంగాణా కాంగ్రెస్ లో మల్లు భట్టి విక్రమార్క కీలకనేత. సీనియర్ కూడా. ఆయన ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇక 2018 నుంచి ఆయన అయిదేళ్ల పాటు సీఎల్పీ లీడర్ గా పనిచేస్తున్నారు. ఒక వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూంటే ఆయనతో పాటుగా పదమూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

హై కమాండ్ దృష్టిలో ఆయన పడ్డారు. ఇక ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన తరువాత మీడియా ముందుకు వచ్చిన భట్టి విక్రమార్క సీఎం పోస్ట్ మీద తనదైన శైలిలో స్పందించరు. తనకు సీఎం పోస్ట్ ఇస్తే తీసుకుంటాను అని ఆయన మనసులో మాటను చెప్పేశారు.

ముఖ్యమంత్రి పదవి అన్నది ఒక బాధ్యత అని దాన్ని నిర్వహిస్తామని కూడా అన్నారు. తెలంగాణాలో దొరల పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని భట్టి చెప్పడం విశేషం. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హమీలను తాము తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.

మొత్తం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కలసి సీఎల్పీ లీడర్ ని ఎన్నుకుంటారని ఆయన అన్నారు. తాను ఇప్పటికే సీఎల్పీ లీడర్ గా ఉన్నాను కాబట్టి కొనసాగమంటే కొనసాగుతాను అన్నారు. అంటే సీఎం పోస్ట్ కోసం అన్నది భట్టి చెప్పుకొచ్చారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, అవి ప్రజలలోకి వెళ్లాయని అందుకే ఈ విజయం దక్కిందని చెప్పారు. వాటిని తుచ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కి దక్కిన విజయం ఏ ఒక్కరిదో కాదని అందరిదీ అని ఆయన అంటున్నారు. అంతే కాదు అంతా ఐక్యంగా కష్టపడి సాధించుకున్న విజయం అని కూడా అన్నారు.

ఈ సమిష్టి కృషికి ప్రజల ఆశీస్సులు దోహదం అయి ఈ భారీ విజయం దక్కింది అని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకూ ఎవరి మీద విమర్శలు చేయబోమని కూడా అన్నారు. తమకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన కాంగ్రెస్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు మొదలెట్టేశారు. కొందరు తెర చాటుగా చేస్తూ ఉంటే మరికొందరు ఓపెన్ గానే మాట బయట పెడుతున్నారు. ఇపుడు భట్టి విక్రమార్క అయితే తన మనసు తెరచేశారు. ఆయన ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. మరి ఆయన విషయంలో హై కమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News