ట్రంప్ నోటి నుంచి భారతీయులకు గుడ్ న్యూస్!

అమెరికాకు వచ్చే వలసల విషయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్య భారతీయులకు గుడ్ న్యూస్ గా మారుతుందని చెప్పాలి.

Update: 2024-12-10 05:10 GMT

మరికొద్ది రోజుల్లో అమెరికాకు అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్య చేశారు. అమెరికాకు వచ్చే వలసల విషయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్య భారతీయులకు గుడ్ న్యూస్ గా మారుతుందని చెప్పాలి. ఎన్ బీసీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ వలసల విషయంలో తన వైఖరిని స్పష్టం చేసిన ఆయన.. చట్టబద్ధంగా తమ దేశానికి వచ్చే వారి విషయంలో తాను వ్యవహరించే తీరును స్పష్టం చేశారు.

తాను అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన వెంటనే.. దేశంలో అక్రమంగా వలస ఉంటున్న అందరిని దేశం నుంచి వెళ్లగొడతానని పేర్కొన్నారు. అంతేకాదు చట్టబద్ధంగా వలస వచ్చే వారికి మార్గం సులువు చేస్తానని చెప్పటం భారతీయులకు వరంగా మారుతుందని చెబుతున్నారు. ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘అమెరికాకు సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలి. కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు నేరుగా అమెరికాకు వస్తున్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదు. తక్షణమే వెళ్లగొట్టాలి’’ అంటూ స్పష్టం చేశారు.

అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలామంది అమెరికాలోనే పుట్టి పెరిగారని.. వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు.. వ్రత్తులు చేస్తున్నారన్న ట్రంప్.. వారి సమస్యను తాను పట్టించుకుంటానని చెప్పారు. వీరి విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొంటానని చెప్పటం గమనార్హం. మరోవైపు అమెరికాకు పొరుగుదేశాలైన కెనడా.. మెక్సికోలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కెనడా.. మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్న నేపథ్యంలో.. ఆ విధానాన్ని కంట్రోల్ చేయకుంటు ఆ దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ రెండు దేశాలు హాహాకారాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు దిమ్మ తిరిగిపోయేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. సుంకాల విషయంలో ఇబ్బందులు ఉంటే.. కెనడా.. మెక్సికోలు అమెరికా 51, 52 రాష్ట్రాలుగా చేరిపోవటం మంచిదన్న సలహా ఇచ్చారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10వేల కోట్ల డాలర్లు.. మెక్సికోకు 30వేల కోట్ల డాలర్ల చొప్పున రాయితీ ఇస్తోందని.. వీటికి చెక్ చెప్పాలన్న ట్రంప్ మాటలు ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. మొత్తంగా కెనడా.. మెక్సికో విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి.

Tags:    

Similar News