ఏపీలో ఇండియా కూటమి...చేరే పార్టీలు అవే...?

ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులో సైతం టీడీపీ నేతలు కొందరు బీజేపీ తీరు మీద తన ఆవేదనను వ్యక్తం చేసినట్లుగా ప్రచారం సాగింది.

Update: 2023-10-30 03:46 GMT

ఏపీలో ఇండియా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో చూస్తే ఎన్డీయే కూటమి ఉందని జనసేన నేత పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఆయన ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి మరీ ఎన్డీయే మీటింగులో బీజేపీ మిత్రపక్షం హోదాలో పాల్గొన్నారు. బీజేపీకి అధికార మిత్రుడిగా పవన్ ఉంటున్నారు.

ఎన్డీయే కూటమి 2024 తరువాత ఏపీలో అధికారంలోకి వస్తుందని కూడా పవన్ ధీమాగా చెబుతున్నారు. ఈ కూటమిలోకి కొత్త పార్టీలు కూడా ఫ్యూచర్ లో వస్తాయని ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడు మీడియాకు చెప్పడం జరిగింది. కొత్త పార్టీలు అంటే టీడీపీ అనే అంటున్నారు. ఆ దిశగా పవన్ ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.

అయితే బీజేపీతో కలసి నడిచేందుకు తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ లేని కూటమి రావాలని కావాలని కొందరు కోరుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ కి ముందు సంగతేమో కానీ ఆయన అరెస్ట్ అయి జైలులో నాలుగు గోడల మధ్యన బంధీ అయ్యాక తెలుగుదేశం నాయకులకు బీజేపీ మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి.

దాని మీద సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మనసులో ఏదీ దాచుకోలేదు కూడా. బీజేపీకి ఏపీ రాజకీయ పరిణామాలు తెలియవా స్పందించాల్సిన అవసరం లేదా అని ఆ మధ్యన ఘాటుగానే మాట్లాడారు. మరి కొందరు సీనియర్లు మాట్లాడడం లేదు కానీ వారికి కూడా అదే భావన ఉంది అని అంటున్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులో సైతం టీడీపీ నేతలు కొందరు బీజేపీ తీరు మీద తన ఆవేదనను వ్యక్తం చేసినట్లుగా ప్రచారం సాగింది.

బీజేపీ కలసివస్తుందని పవన్ ఆలోచిస్తూంటే టీడీపీలో పెద్ద నేతలు మాత్రం బీజేపీతో వద్దే వద్దు అని అంటున్నారు. చంద్రబాబు ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ బీజేపీని దూరం పెడితేనే ఫ్యూచర్ అని తమ్ముళ్ళలో చాలా మందికి అభిప్రాయం బలంగా ఉంది అని అంటున్నారు

ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు కూడా బీజేపీతో బంధం తెంచుకోమని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రోత్సాహం అండ లేకపోతే జగన్ బాబుని అరెస్ట్ చేసే దుస్సాహసం చేయలేరని కూడా సీపీఐ నారాయణ లాంటి వారు ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఇండియా కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోరాడాలన్న ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి.

దానికి కాంగ్రెస్ నుంచే ప్రతిపాదనలు వస్తున్నాయి. కాంగ్రెస్ కి తెలంగాణాలో ఆశాజనకమైన వాతావరణం ఉండడంతో దాని ప్రభావం ఏపీ మీద పడుతుందని ఆ విధంగా ఏపీలో కూడా కాంగ్రెస్ రాజకీయ జాతకం ఎంతో కొంత మారుతుందని కూడా లెక్క వేస్తున్నారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో ఇటీవల యాక్టివ్ అయి ఏకంగా వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా అయిన ఎన్ రఘువీరారెడ్డి ఏపీలో ఇండియా కూటమి ఏర్పాటు అవుతుందని కీలక కామెంట్స్ చేశారు.

రానున్న ఎన్నికల్లో ఏపీలో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీలో కూడా రాజకీయంగా బలోపేతం అయ్యేలా ఇండియా కూటమిగా పని మొదలుపెట్టామని ఆయన అంటున్నారు.

ఏపీలో ఏమి మేలు జరగాలన్నా కూడా జాతీయ పార్టీల వల్లనే అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రత్యేక హోదా రాదు అని ప్రజలకి తెలుపుతామని చెప్పారు. అలాగే ఏపీలో పెద్ద ఎత్తున అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన అంటున్నారు.

ఏపీ నడవాలంటే కేంద్రం అండ ఉండాలని కేంద్రం నుంచే అప్పులని ఏపీ చేయగలదని ఆయన చెప్పారు.బీజేపీ ఇకపై రాష్ట్రానికి అప్పులు ఇవ్వదని కొత్త మాట రఘువీరా చెప్పడం విశేషం. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే ఏపీకి అన్నీ సాధ్యమవుతాయని ఆయన అంటున్నారు.

అదే విధంగా ఏపీలో సీట్ల సర్దుబాటు విషయంలో సైతం ఇండియా కూటమిదే నిర్ణయం ఉంటుందని అన్నారు. సీట్ల సర్దుబాటుకు ఏపీలో ఇంకా నాలుగు నెలలు సమయం ఉందని అప్పటికి ఇండియా కూటమిలో సీట్లు సర్దుబాటుతో పాటు పొత్తులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఏపీకి ఏమీ కాదు అని రఘువీరా అంటున్నా తెలుగుదేశం లాంటివి చేరితే నో అనే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం వ్యూహం కూడా అదే అంటున్నారు.

తెలంగాణాలో సొంతంగా ఏపీలో పొత్తులతో దండీగా ఎంపీ సీట్లు తెచ్చుకుంటే కర్నాటక ఎటూ తమ చేతులలో ఉందని తమిళనాడులో డీఎంకేతో పొత్తులు ఉన్నాయని, కేరళాలో సైతం వామపక్షాలతో పొత్తులు ఉంటాయి కాబట్టి మొత్తం సౌత్ లో 129 సీట్లలో అత్యధికం కైవశం చేసుకుంటే కేంద్రంలో అధికారం తధ్యమని కాంగ్రెస్ భావిస్తోంది అంటున్నారు. మరి ఏపీలో ఇండియా కూటమికి ఒక రూపు రేఖా రావాలీ అంటే మరింత కాలం గడవాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయటకు వచ్చాకనే ఏపీ రాజకీయం మారుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News