అక్రమ పెళ్లి కేసులో ఇమ్రాన్ ఖాన్ నిర్దోషి.. మరో ఊరట

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు వరుస పెట్టి ఊరట లభిస్తున్నాయి

Update: 2024-07-14 11:30 GMT

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు వరుస పెట్టి ఊరట లభిస్తున్నాయి. ఆయనపై నమోదైన కేసుల విచారణల్లో సదరు కోర్టులు ఆయన తప్పు చేయట్లేదని చెబుతున్నా.. జైలు నుంచి విడుదల మాత్రం కాని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనపై నమోదైన అక్రమ పెళ్లి కేసులో ఆయనపై మోపిన ఆరోపణలు నిజం కావని పేర్కొనటమే కాదు.. ఈ కేసులో ఇమ్రాన్ తప్పు చేయలేదని ఇస్లామాబాద్ కోర్టు తేల్చింది.

ఈ కేసు వివాదంలోకి వెళితే.. ఇస్లాంలో ఒక మహిళ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాలుగు నెలలు పూర్తి కాకుండా పెళ్లి చేసుకోకూడదు. ఇమ్రాన్.. ఆయన సతీమణి బుష్రాబీబీల మధ్య జరిగిన పెళ్లి అక్రమంగా పేర్కొంటూ బుష్రాబీబీ మాజీ భర్త కోర్టులో కేసు వేశారు. వారి పెళ్లి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసు విచారణ ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇమ్రాన్ దంపతులపై మోపిన అభియోగాల్లో వాస్తవం లేదని తేల్చింది. వీరిపై పెట్టిన కేసును కొట్టేసింది. అంతేకాదు.. ఇతర కేసుల్లో అవసరం లేకుంటే వారిద్దరిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలన్న ఆదేశాల్ని జారీ చేసింది.అయితే.. పలు కోర్టుల్లో ఇమ్రాన్ పై మోపిన ఆరోపణలు నిజం కావని తీర్పులు వస్తున్నా.. ఆయనపై నమోదవుతున్న కొత్త కేసుల కారణంగా జైలుకే పరిమితం అవుతున్నారు. మరెన్నాళ్లు సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News