ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు.. కారణమిదే!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. త్వరలో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ఇమ్రాన్ ఖాన్ కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కాగా అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
ఇమ్రాన్ ఖాన్ తోపాటు ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది.
అయితే, ఆ వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది.
ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణహాని, భద్రతా సమస్యల నేపథ్యంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ తోపాటు షా మహ్మద్ ఖురేషికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది. ఇదే కేసులో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా పదేళ్ల జైలుశిక్ష పడినట్లు ఇమ్రాన్ తరపు న్యాయవాది షోయబ్ షాహీన్ వెల్లడించింది.
పాకిస్థాన్ లో 2024 ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు శిక్ష పడటం సంచలనంగా మారింది. కాగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ దూసుకుపోతోంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన పోటీ చేయడానికి కోర్టు అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ప్రపంచంలోనే ఉత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ 1992లో తన కెప్టెన్సీలో పాకిస్థాన్ కు వన్డే వరల్డ్ కప్ ను సాధించిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ ను సాధించలేకపోవడం గమనార్హం.