మన నిఘా సంస్థపై అమెరికా 'రా'డార్.. ఆంక్షలు తప్పవా?

అందుకనే తాజాగా ఓ సంస్థ చేసిన ఫిర్యాదుతొ రాపై అమెరికా ఆంక్షలు పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.;

Update: 2025-03-26 13:30 GMT
మన నిఘా సంస్థపై అమెరికా రాడార్.. ఆంక్షలు తప్పవా?

ఇజ్రాయెల్ కు మొస్సాద్.. అమెరికాకు సీఐఏ.. మరి మనకూ ఆ స్థాయిలో ఓ నిఘా సంస్థ ఉంటే ఎంత బాగుండు అని గతంలో అనుకునేవారు.. ఇదివరకటి సంగతి ఏమోకానీ.. భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అంటే ఇప్పుడు మాత్రం ప్రపంచమంతా తెలిసొచ్చింది.. కెనడాలో ఖలిస్థానీల అంశమే కానీ.. పాకిస్థాన్ లో అలజడి.. ఇలా ఎక్కడ ఏం జరిగినా సరే..

అందుకనే ‘రా’ అంటే ఉగ్ర సంస్థలు సైతం ఇప్పుడు ఎందుకొచ్చిన గొడవ ‘రా’ అనుకుంటూ తోక ముడుస్తున్నాయి.. ప్రపంచ దేశాల్లో ఉంటే భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న శక్తులు కూడా హడలెత్తుతున్నాయి. అయితే ‘రా’పై ఆంక్షలు విధించాలని అమెరికా సంస్థ ఒకటి అక్కడి ప్రభుత్వానికి సూచించిందట.

ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎప్పడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి. అమెరికాకు దశాబ్దాలుగా మిత్రులుగా ఉన్న యూరప్ దేశాలకూ షాక్ ఇచ్చేస్తున్నారు ట్రంప్. అందుకనే తాజాగా ఓ సంస్థ చేసిన ఫిర్యాదుతొ రాపై అమెరికా ఆంక్షలు పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ‘రా’పై ఆంక్షలను సిఫారసు చేసిన సంస్థ పేరు ‘ది యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడమ్‌’ అనే సంస్థ. అయితే, భారత్ ను ఎంతగానో ద్వేషిస్తూ, ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నిందంటూ ’రా’ను నిందిస్తోంది. తన తాజా వార్షిక నివేదిక ప్రకారం భారత్ లో మైనార్టీలు దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ ను ప్రకటించాలని కూడా సూచించింది.

కాగా అమెరికా సంస్థ చేసిన సిఫారసులను ట్రంప్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావించలేం. ఎందుకంటే అమెరికా ఒకప్పుడు సుదీర్ఘ యుద్ధం చేసిన వియత్నాంలోని కమ్యూనిస్ట్‌ పాలకులను కూడా ఈ కమిషన్‌ నివేదిక తప్పుబట్టింది. భారత్ లాగే వియత్నాంలోనూ మత స్వేచ్ఛ లేదని పేర్కొంది. ఆందోళనకర జాబితాలో చేర్చాలని సూచించింది. కాగా వ్యతిరేక నివేదికలపై తక్షణమే స్పందించే భారత్ ఇంకా అమెరికా సంస్థ నివేదికను ఎంత గట్టిగా తిప్పికొడుతుందో చూడాలి.

ఆసియాలో చైనాను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్‌, వియత్నాం చాలా ముఖ్యం. అందుకే ట్రంప్‌.. ‘రా’ జోలికి రారని భావిస్తున్నారు. రెండేళ్ల కిందట నుంచి అమెరికా, కెనడాల్లో సిక్కు వేర్పాటువాదులపై దాడులు జరుగుతున్నాయి. కొందరు హతమయ్యారు కూడా. దీనివెనుక రా ఉందనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపణలు మోపింది. పన్నూ అమెరికాలోనే ఉంటున్నాడు. కొన్ని నెలల కిందట భారత్ లో సీఆర్పీఎఫ్‌ స్కూళ్లను, ఎయిర్‌ ఇండియా విమానాలను, కుంభమేళాను లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చాడు. క్రికెట్ మ్యాచ్ లనూ టార్గెట్ చేశాడు.

Tags:    

Similar News