వెండి నాణ్యతకు హాల్ మార్కింగ్.. కేంద్రం నిర్ణయం
బంగారం నాణ్యత గురించి చర్చ వచ్చినంతనే.. 24 క్యారెట్ అనేస్తారు. అదే మాటను వెండి గురించి అడిగితే.. తడబడతారు.
బంగారం నాణ్యత గురించి చర్చ వచ్చినంతనే.. 24 క్యారెట్ అనేస్తారు. అదే మాటను వెండి గురించి అడిగితే.. తడబడతారు. చెప్పేందుకు మాటలు వెతుక్కుంటారు. ఇది నూటికి 90 శాతం మందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. దీనికి వారి తప్పు లేదనే చెప్పాలి. ఎందుకుంటే.. ఇప్పటివరకు వెండి నాణ్యతను తెలిపే ప్రమాణాల్ని తెలియజేయాలని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేకపోవటమే.
ఈ కారణంతో వెండి సామాన్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువమందికి తెలీకుండానే నాణ్యత విషయంలో మోసానికి గురవుతుంటారు. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశం మీద కేంద్రం ఫోకస్ పెట్టింది. తాజాగా వెండి వస్తువుల్లో నాణ్యత ఎంత ఉందో గుర్తించేందుకు ఉపయోగపడే హాల్ మార్కింగ్ ను తప్పనిసరిగా అమలు చేసే ప్రక్రియ చేపట్టాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.
దీంతో.. రంగంలోకి దిగిన సదరు సంస్థ ఇప్పుడీ విషయం మీద ఫోకస్ చేసింది. ఆభరణాలకు సంబంధించిన పెద్ద ఎత్తున కొనుగోలు చేసే వెండికి సంబంధించిన నాణ్యతను సూచించే మార్కు ఇప్పటివరకు తప్పనిసరి అన్నది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నతలెత్తినప్పుడు విస్మయానికి గురి కాక మానదు. కేంద్ర మంత్రి సూచన నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలను బీఐఎస్ మదింపు చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి స్వచ్ఛతను నిర్ణయించే హాల్ మార్కింగ్ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగానే ఉంది తప్పించి తప్పనిసరి కాకపోవటం గమనార్హం.
కేంద్రమంత్రి నుంచి వచ్చిన సూచన నేపథ్యంలో రానున్న మూడు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో హాల్ మార్కింగ్ ను అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. బంగారానికి ఏ విధంగా అయితే నాణ్యత గురించి ముద్రిస్తారో.. అలానే వెండిపైనా ఆరు అంకెలు.. అక్షరాలతో కూడిన ప్రత్యేక కోడ్ ను ప్రింట్ చేసే అంశం మీద చర్చలు జరుగుతుననాయి. మిగిలిన రాష్ట్రాలకు చెందిన వెండి వ్యాపారులు సానుకూలంగా ఉండగా.. గుజరాత్ కర్ణాటకతో సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయానికి అమలు చేసేందుకు కొంత సమయం అవసరమవుతుందని చెప్పటం గమనార్హం.