మనిషి పిలిస్తే వరుణుడు పలికేలా కేంద్రం సరికొత్త భారీ ప్రయత్నం!
అవును... వర్షాన్ని వద్దనుకుంటే ఆపేలా, కావాలనుకుంటే రప్పించేలా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇటీవల కాలంలో వరుణుడి ప్రతాపం, ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది తెలిసిన విషయమే. కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి! ఈ క్రమంలో వరుణుడిని కంట్రోల్ చేసేలా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు! ఈ మేరకు ఈ మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది.
అవును... వర్షాన్ని వద్దనుకుంటే ఆపేలా, కావాలనుకుంటే రప్పించేలా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాధనాలను ఉపయోగించేందుకు నడుం భిగించింది భారత్. రానున్న ఐదేళ్లలో రూ.2వేల కోట్లతో కార్యచరణ అమలుకు రంగం సిద్ధం చేసింది. దీని పేరే.. "మిషన్ మౌసం".
ప్రస్తుతం వాతావరణ ప్రక్రియల్లో సంక్లిష్టత, అబ్జర్వేషన్ మోడలింగ్ ప్రక్రియల్లో పరిమితుల కారణంగా భారీ వర్షాలు, వరదలు, మేఘాల విస్ఫోటాలు, ఉరుములు, పిడుగులు, కుంభవృష్టి, కరువు వంటి ఘటనలను అంచనా వేయడం అసాధ్యంగా మారుతోందని భూశాస్త్ర మంత్రిత్వ శాఖ చెబుతోంది!
ఇలాంటి సంక్లిష్ట వాతావరణ నమూనాలను అర్ధం చేసుకునేందుకుగానూ ఉపరితల వాతావరణ ప్రక్రియల గురించి పూర్తి అవగాహన అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 12 కి.మీ. ఉన్న న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ (ఎన్.డబ్ల్యూ.పి) పరిధిని ఆరు కి.మీ.లకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ మిషన్ ను రెండు దశల్లో చేపట్టనుంది.
ఇందులో తొలిదశలో భాగంగా 2026 మార్చి వరకూ పరిశీలనాత్మక నెట్ వర్క్ ను విస్తరిస్తారు. ఇందులో భగంగా... డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, విండ్ ప్రోఫైలర్లు, రేడియో మీటర్లను ఏర్పాటు చేస్తారు. రెండో దశలో వీటిని మరింత బలోపేతం చేసేందుకు శాటిలైట్లు, విమానాలను ఉపయోగిస్తారు.
ఈ సమయంలో మేఘాల్లో జరిగే ప్రక్రియల అధ్యయనం కోసం పూణె లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటియొరాలజీ (ఐ.ఐ.టీ.ఎం) లో క్లౌడ్ ఛాంబర్ ఏర్పాటు చేయనున్నారు. అలా.. వాతావరణ అంచనాల కచ్చితత్వాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేపట్టనున్నారు. తద్వారా వ్యవసాయానికీ అవసరమిన కచ్చితమైన వాతావరణ అంచనాలను గ్రామీణ ప్రాంతాలకు అందించాలని భావిస్తున్నారు.