అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్... హమాస్ తో లింకులున్నాయా?
ఈ సమయంలో ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరణకు సిద్ధమైనట్లు కథనాలొస్తున్నాయి!;
అమెరికాలో ఇటీవల వరుస బహిష్కరణలు జరుగుతోన్న కథనాలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల హెజ్ బొల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. కిడ్నీ మార్పిడి స్పెషలిస్టుగా పనిచేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలవీని దేశం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ భారతీయ విద్యార్థిని బహిష్కరణకు సిద్ధమైనట్లు కథనాలొస్తున్నాయి!
అవును... అగ్రరాజ్యం అమెరికాలో పోలీసులు ఓ భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు కథనాలొస్తున్నాయి. అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్న బదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్.. హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలను కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు కథనాలు వెలువడుతున్నాయి.
వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసెర్చర్ గా ఉన్న బాదర్ ఖాన్ సూరిని.. సోమవారం అర్థరాత్రి వర్జీనియాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకొన్న అనంతరం.. వీసా కూడా రద్దు చేసినట్లు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా... పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తో ఖాన్ సూరి సంబంధాలు కలిగి ఉన్నాడని.. సోషల్ మీడియా వేదికగా యూదు వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నాడని.. ఇలాంటి నేరాలకు పాల్పడినందుకే అతడిని అదుపులోకి తీసుకొని భారత్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.
దీంతో... ఖాన్ సూరి ఇమిగ్రేషన్ కోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. తన భర్యకు పాలస్తీనా మూలాలు ఉండటం మినహా మరో కారణం కనిపించడం లేదని.. ఆ కారణంగానే తనను టార్గెట్ చేసుకున్నారని కోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్పందించింది. ఇందులో భాగంగా... బదర్ ఖాన్ సూరి డాక్టరల్ రీసెర్చర్ గా ఉన్నారని.. అతడు ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొంటున్నారనే విషయాలు, ఈ అరెస్టుకు గల కారణాలు ఏమిటనేది తమకు తెలియదని.. ఈ కేసుకు సంబంధించిన విచారణకు తాము సహకరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.