కేటీఆర్ పాదయాత్ర.. ఇంత ఎర్లీగానా..?
ఎప్పుడొచ్చామన్నది కాదు.. అసలు బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్.. అవును.. చంద్రబాబు రెండు దఫాల ‘హైటెక్’ పాలన..;
ఎప్పుడొచ్చామన్నది కాదు.. అసలు బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్.. అవును.. చంద్రబాబు రెండు దఫాల ‘హైటెక్’ పాలన.. రైతులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత నిండుకున్న వేళ.. కరువుతో అల్లాడిన ఆంధ్రావనిలో నాడు ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర అద్భుత విజయం సాధించింది. 2019కి ముందు వైఎస్ షర్మిల, జగన్ లు చేసిన యాత్ర వైసీపికి అధికారాన్ని సాధించి పెట్టింది. ఇక 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని సాధించి పెట్టింది. తెలంగాణలోనూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను దించడానికి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందర చేసిన పాదయాత్ర ఆయనను సీఎం చేసింది.
ఇక గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండగా చేసిన పాదయాత్రతో బీజేపీకి గ్రేటర్ లో సీట్లు.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. అసలు పాదయాత్ర తెలుగు నాట ఓ గేమ్ చేంజర్. దాన్ని సరిగ్గా వాడితే సీఎంలు అయిపోతారన్నది చరిత్ర. కానీ కేటీఆర్ ఇప్పుడు ప్రకటించిన పాదయాత్ర మిస్ మ్యాచ్ అవుతోంది.. కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందన్నది అందరి మాట.. కానీ ఎన్నికలకు ఇంత ముందర వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడం ఖచ్చితంగా తొందరపాటు యేనా? ఎన్నికల ముందర చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ ఇంత ముందుగా మొదలుపెడితే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది (2026) పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలతో ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమైన కేటీఆర్, ఈ ఏడాది చివరి వరకు ఇదే తరహా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.
గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడమే ప్రధాన అజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. "యాత్ర గురించి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించాను. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటాను. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తాను" అని కేటీఆర్ వెల్లడించారు. ఆయన ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణులు కొంత నిరాశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర పార్టీకి ఎంతగానో ఊతమిచ్చింది. అదే తరహాలో కేటీఆర్ కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ, పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రకు సంబంధించిన సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఏడాది కేటీఆర్ చేపట్టనున్న ఈ పాదయాత్ర బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి, ప్రజల్లో విశ్వాసం నింపడానికి ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ ప్రజల నాడిని పట్టుకునే అవకాశం ఉంది.
పాదయాత్ర అనేది భారతీయ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగుతోంది. గతంలో ఎందరో రాజకీయ నాయకులు పాదయాత్రల ద్వారా ప్రజల్లో విశేషమైన గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేయకున్నా.. అక్కడక్కడా చేసిన చిన్న చిన్న పాదయాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇప్పుడు కేటీఆర్ పూర్తిస్తాయిలో పాదయాత్రను చేపట్టడం ద్వారా పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.
అయితే, ఈ పాదయాత్ర కేటీఆర్ ఇంత ముందుగా మొదలు పెట్టడమే టైమింగ్ లోపంగా చెబుతున్నారు. టైంతోపాటు టైమింగ్ తో చేస్తేనే ప్రజల్లో ముద్ర వేయగలరని విశ్లేషఖులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు. కేటీఆర్ ఇంతముందుగా ప్రజల్లోకి వెళితే ఎన్నికల వేళ ఏదైనా జరిగితే అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎన్నికల వేడిలో పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు.కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంకాస్త టైం ఇవ్వాలి.
మొత్తానికి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పూర్తి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషి ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.