ఆదిత్య ఠాక్రేపై పిటిషన్.. సుశాంత్ మేనేజర్ దిశ తండ్రి సంచలన ఆరోపణలు!

సుమారు ఐదేళ్ల క్రితం (14-06-2020) బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-20 11:49 GMT

సుమారు ఐదేళ్ల క్రితం (14-06-2020) బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అతడి మరణానికి సుమారు వారం రోజుల ముందు అతడి మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణించారు. ఇందులో భాగంగా.. 2020 జూన్ 8న ముంబైలోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో... ఆమె మరణంపై పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి.

పైగా... ఆమె అనుమానాస్పద మృతి అనంతరం వారం రోజుల వ్యవధిలో హీరో సుశాంత్ తన ఫ్లాట్ లో శవమై కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇదే సమయంలో... ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలూ వచ్చాయి. నాడు ఈ వ్యవహరం తీవ్ర సంచలనంగా మారింది.

అయితే తాజాగా దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా... శివసేన నేత ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఆదిత్య ఠాక్రేపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో... ఈ వ్యవహారం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా... నాడు జూన్ 8న తన కుమార్తె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని.. ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రేతో పాటు అతని బాడీగార్డులు, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి, మరికొంతమంది హాజరయ్యారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఆమె లైంగిక వేధింపులకు గురైందని.. తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని సతీష్ ఆరోపించారు.

అందువల్ల.. ఈ కేసుపై విచారణ జరిపించాలని సతీష్ సాలియన్ ముంబై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగానూ పెను దుమారం రేపుతోందని అంటున్నారు!

మరోపక్క... తనపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. సతీష్ సాలియన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు! తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నం జరుగుతోందని.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే, తాను న్యాయస్థానంలోనే స్పందిస్తానని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు.

Tags:    

Similar News