ఈ ముంబై గణేశుడు మామూలు రిచ్ కాదు.. రూ. 360 కోట్లు...!

దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. భారీ ఎత్తైన విగ్రహాలు.. భారీ సెట్టింగ్‌ లతో కూడిన మండపాలు ఏర్పాటు చేశారు

Update: 2023-09-19 04:00 GMT

దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. భారీ ఎత్తైన విగ్రహాలు.. భారీ సెట్టింగ్‌ లతో కూడిన మండపాలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా తొమ్మిది రోజుల కోసం ఏర్పాటు చేసే విగ్రహాలు, మండపాల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన విగ్రహం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ముంబైలోని ప్రముఖ జీ.ఎస్‌.బీ సేవా మండల్‌ వారు ఏర్పాటు చేసిన మహాగణపతి ఈసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక్కడి వినాయకుడి విగ్రహాన్ని ఏకంగా 69 కిలోల బంగారు, 336 కిలోల వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించారు. దీంతో ఇది అత్యంత ఖరీదైన విగ్రహంగా చరిత్ర సృష్టించిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇంత ఖరీదైన విగ్రహం ఉన్న ఈ మండం విషయంలో జీ.ఎస్‌.బీ సేవా మండల్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆ మండపానికి ఇన్సూరెన్స్ చేయించాలని ఫిక్సయ్యింది. దీంతో... రూ.360.40 కోట్ల బీమా చేయించి ఔరా అనిపించింది. ఇదే సమయంలో మండపం పక్కల పటిష్ఠ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది.

అయితే గత 68 ఏళ్లుగా అక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసి నవరాత్రోత్సవాలు చేస్తున్న జీ.ఎస్‌.బీ సేవామండల్‌ నిర్వాహకులు... ఈసారి 69వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే మండపం వద్ద మొట్ట మొదటిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

అదేవిధంగా... భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, వచ్చే ఏడాది ప్రారంభోత్సవం పురస్కరించుకుని హోమం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా... గతేడాది సైతం ఈ గణేశ్‌ మండపానికి రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించిన విషయం తెలిసిందే.

ఇక ఈ ఇన్సూరెన్స్‌ లో రూ .38.47 కోట్లను.. బంగారం, వెండి, ఇతర ఆభరణాలకు సంబంధించి కవర్ కానున్నట్లు చెబుతున్నారు. మరో రూ .30 కోట్లు మండపం, భక్తులకు ఇన్సూరెన్స్ కవర్ కానుండగా... మండపం వాలంటీర్లు, ఇతర వర్కర్లు, సెక్యూరిటీ గార్డ్‌ లకు సంబంధించి వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ .289.50 కోట్లు కవర్ అవుతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News