28 ఏళ్ల తర్వాత భారత్ కు 'అందమైన' చాన్స్.. ఈసారీ వివాదమేనా?
ఇలాంటి వారందరూ పోటీ పడే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు.
అప్పుడెప్పుడో 1996లో జరిగిన ఆ పోటీలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. భారత్ వంటి దేశంలో అలాంటి పోటీలా..? అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యాన నగరిలో జరిగిన పోటీలను అడ్డుకున్నారు. అయితే, దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచమంతా ఆసక్తితో చూసే పోటీలను.. విజేతగా నిలిచేది ఎవరా? అని ఉత్సాహంగా చూసే పోటీలను నిర్వహించడాన్ని అడ్డుకోవడం తగదనే వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.
ప్రపంచ సుందరాంగులందరూ..
ప్రపంచంలోని అందగత్తెలందరూ ఒకచోట చేరితే ఎలా ఉంటుంది..? చూడడానికి రెండు కళ్లూ చాలవు కదూ..? వారిలో అందంతో పాటు ఆత్మవిశ్వాసమూ ఉంటే.. ఇంకేం? అతిలోక సుందరులుగానే భావించాలి. ఇలాంటి వారందరూ పోటీ పడే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఏమిటీ పోటీల ప్రత్యేకత..
ప్రపంచ సుందరి పోటీలు అంటే కేవల సుందరీమణుల పోటీలు కాదు. అందం, వైవిధ్యం, సాధికారత మూడింటినీ కలగలిపి విజేతను ఎంపిక చేస్తారు. అంటే మూర్తీభవించిన అందగత్తె అన్నమాట. ఇలాంటి వేడుకను చూసేందుకు టీవీల ముందు కోట్లాది మంది అతుక్కుపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా, భారత్ లో 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. మళ్లీ 28 ఏళ్ల తర్వాత మన దేశం వేదికగా నిలుస్తోంది. 1996లో బెంగళూరులో నిర్వహించిన సమయంలో ఓ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.
విశ్వ సుందరుల్లో మనవాళ్లు వీరే..
రీటా ఫారియా 1966లో భారత్ నుంచి తొలిగా ప్రపంచ సుందరి కిరీటం అందుకున్నారు. 1994లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనమంతా ఎంతో ఆరాధిస్తున్న ఐశ్వర్య రాయ్.. ఆ ఏడాది విజేత. ఇక 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ గా ఎంపికయ్యారు.
రెండేళ్ల విరామం తర్వాత..
మిస్ వరల్డ్ పోటీలను 2022లో చివరిసారిగా నిర్వహించారు. అప్పట్లో పోలెండ్ భామ కరోలినా బిలాస్కా కిరీటం అందుకుంది. భారత్ లో ఈ ఏడాది గెలిచినవారికి ఆమెనే కిరీటాన్ని బహూకరించనున్నారు. కాగా, మిస్ వరల్డ్ పోటీలకు 130 పైగా దేశాల నుంచి అతివలు పాల్గొననున్నారు. అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పోటీలు జరుగుతాయి. మార్చి 9న ఫైనల్స్ కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. అందం మాత్రమే కాక వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసి విజేతను ఎంపికచేయడం మిస్ వరల్డ్ పోటీల ప్రత్యేకత. సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం.