భారత్ - కెనడా మధ్య వార్ జరిగితే.. పెంటగాన్ మాజీ అధికారి విశ్లేషణ ఇదే
ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ సెక్యూరిటీ సంస్థ పెంటాన్. ఈ సంస్థలో పని చేసే అధికారుల చేతుల్లో ప్రపంచంలోని ఏ దేశానికి సంబంధించిన సమాచారమైనా ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ సెక్యూరిటీ సంస్థ పెంటాన్. ఈ సంస్థలో పని చేసే అధికారుల చేతుల్లో ప్రపంచంలోని ఏ దేశానికి సంబంధించిన సమాచారమైనా ఉంటుంది. వారి వద్ద ఉన్న డేటా ఎంత లోతైనదన్న విషయంలో ఎవరికి ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటి పెంటగాన్ కు చెందిన మాజీ ఉన్నతాధికారి మైఖేల్ రూబిన్ నోట వెంట వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల కాలంలో భారత్ - కెనడా మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆయన రెండు.. మూడు కీలక అంశాల్ని ప్రస్తావిస్తూ.. చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అందులో ముఖ్యమైనది ఈ పరిణామం రెండు దేశాల్లో ఎవరికి నష్టమన్నది? దీనిపై ఆయన స్పందిస్తూ.. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్ కంటే కూడా కెనడాకే ఎక్కువ నష్టమని తేల్చారు. అంతేకాదు.. ఒకవేళ అగ్ర రాజ్యం అమెరికాకు కెనడా రాజధాని ఒట్టావా.. భారత్ రాజధాని ఢిల్లీలో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. అగ్రరాజ్యం కచ్ఛితంగా ఢిల్లీని మాత్రమే ఎంపికచేసుకుంటుందని పేర్కొనటం గమనార్హం.
ఎందుకంటే అమెరికాకు భారత్ తో సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్న ఆయన.. ‘‘ఒకవేళ కెనడా భారత్ తో కానీ యుద్ధం చేయాలంటే ఏనుగుతో చీమ పోరాడినట్లే అవుతుంది. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఎక్కువ కాలం కొనసాగలేడు. ఆయన పెద్ద తప్పు చేశారని నేను భావిస్తున్నా. వెనక్కి తగ్గలేని రీతిలో ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవు. కెనడా ప్రభుత్వం ఒక ఉగ్రవాదికిఎందుకు ఆశ్రయం కల్పిస్తుందో ట్రూడో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత్.. కెనడా స్నేహితుల్లో అమెరికా ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే.. మేం బారత్ ను ఎంచుకుంటాం. ఎందుకంటే హత్యకు గురైన నిజ్జర్ ఉగ్రవాది. భారత్ చాలా ముఖ్యమైనది. మా బంధం చాలా కీలకం’’ అంటూ ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై అమెరికా బహిరంగంగా జోక్యం చేసుకుంటుందా? అన్న ప్రశ్నకు సదరు అధికారి స్పందిస్తూ.. బారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ముఖ్యంగా హిందూ మహా సముద్ర పరీవాహక ప్రాంతంలో చైనా నుంచి పెరుగుతున్న ఆందోళనల వేళ భారత్ తో బంధం చాలా వ్యూహాత్మకమైనదంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. కెనడా పోరు బాటను ఎంచుకుంటే ఆ దేశం భారత్ ముందు చీమగా పేర్కొనటం.. అదే సమయంలో భారత్ ను ఏనుగుగా అభివర్ణించటం గమనార్హం.