కెనడాలో వెలిసిన ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు !
వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు కెనడా అడ్డాగా మారిందని భారత ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు తెలిపింది
వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు కెనడా అడ్డాగా మారిందని భారత ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు తెలిపింది. తాజాగా కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు వాంకూవర్ నగరంలో ఇందిరా గాంధీ హత్య తాలూకు పోస్టర్లు ఏర్పాటు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
‘వాంకూవర్ లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు ఏర్పాటు చేశారు. కెనడాలో ఇలా హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు.
‘‘ వాంకూవర్ లోని ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లను ఏర్పాటు చేశారు. హిందూ కెనేడియన్లలో భయోత్పాతం కలిగించేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. గత ఏడాది బ్రాంప్టన్ లో జరిగిన ఘటనల కొనసాగింపే ఈ బెదిరింపు. హిందువులు ఇండియాకు వెళ్లాలంటూ వేర్పాటువాది పన్నున్ కొన్ని నెలల క్రితం హెచ్చరించాడు. ఇలాంటి చిత్రాల ప్రదర్శన చివరకు హింసకు దారి తీసే అవకాశం ఉంది’’ అని
భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్యా అభిప్రాయపడ్డాడు.
సిక్కు వేర్పాటు వాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్‌కు పన్నున్ ప్రతినిధిగా, న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక సిక్కు రాష్ట్రమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థపై భారత్ నిషేధం విధించింది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డులు కాల్చి చంపేసిన విషయం తెలిసిందే.