ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఏకంగా గవర్నర్ ఫోన్..?

నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు.

Update: 2025-01-25 06:44 GMT

గత ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏకంగా ఓ గవర్నర్ ఫోన్‌ను సైతం ట్యాపింగ్ చేసినట్లుగా వెల్లడైంది. ఆయన పీఏను అధికారులు విచారించగా.. అసలు విషయం వెలుగుచూసింది.

నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఇంద్రసేనారెడ్డి పీఏను విచారించగా.. ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనా రెడ్డి త్రిపుర గవర్న్‌గా ఉన్నారు. కాగా.. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇప్పటివరకు కాంగ్రెస్‌కు సంబంధించిన నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేసినట్లు అందరూ అనుకున్నారు. కానీ.. తాజాగా బీజేపీకి చెందిన నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నారు.

ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు అధికారులు అనుమానించి విచారణ చేపట్టారు. దాంతో ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్న పీఏను విచారించారు. ఈ కేసులో ఆయనను సాక్షిగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేనారెడ్డి సైతం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనే దానిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్ పర్సన్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ.. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరిని విచారిస్తుంటే కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తుండడంతో.. కేసులో సంచనాలు బయటపడుతున్నాయి.

Tags:    

Similar News