ఏ-14గా లోకేష్... ఫస్ట్ రియాక్షన్ ఇదే!

ఇన్నర్ రింగ్ రోడ్ అలన్ మెంట్ కేసులో తనను ఏ-14గా చేర్చిన అనంతరం లోకేష్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ లైన్ వేదికగా ఇచ్చారు

Update: 2023-09-26 10:55 GMT

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసుల్లో తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ నిందితుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏ-14 నిందితుడిగా చేరుస్తూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సమయంలో ఈ విషయంలో లోకేష్ స్పందించారు.

అవును... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో నారా లోకేష్ ను ఏ-14గా చేర్చారు. దీనిపై విచారణ జరిపేందుకు సీఐడీ సిద్దమవుతోందని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ విషయంపై నారా లోకేష్ తాజాగా స్పందించారు. యువ‌గ‌ళం పేరు వింటేనే జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నాడంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు!

ఇన్నర్ రింగ్ రోడ్ అలన్ మెంట్ కేసులో తనను ఏ-14గా చేర్చిన అనంతరం లోకేష్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ లైన్ వేదికగా ఇచ్చారు. ఇందులో భాగంగా... యువ‌గ‌ళం పేరు వింటే జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో తన పాద‌యాత్ర ఆరంభం కాకూడ‌ద‌ని జీవో 1 తెచ్చినప్పటికీ... యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మై గ‌ర్జించిందని అన్నారు.

అనంతరం... ఇలా ఎక్కడిక‌క్కడ అడ్డుకున్నా కూడా జ‌న‌జైత్రయాత్రగా యువగళం ముందుకు సాగిందని చెప్పిన లోకేష్... మ‌ళ్లీ యువ‌గ‌ళం ఆరంభిస్తామ‌నే స‌రికి, తన శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో తనను ఏ14గా చేర్పించారని అన్నారు. ఇదే సమయంలో రిపేర్ల పేరుతో రాజ‌మ‌హేంద్రవ‌రం బ్రిడ్జిని మూసేయించారని అన్నారు.

ఇదే సమయంలో ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసినా తన యువ‌గ‌ళం ఆగ‌దని, ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్యమే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వ‌ర‌కూ న‌డిపిస్తుందని లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కాగా... గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించిన ఈ ప్రభుత్వం ఆ తర్వాత దీని అలైన్మెంట్లో పలు మార్పులు చేసిందని, దీంతో క్విడ్ ప్రోకో జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.

ఇందులో భాగంగా... పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన 168.45 ఎకరాల భూమి పక్కనే ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్ మెంట్ మార్చారని.. తద్వారా ఆయనకు ప్రయోజనం కల్పించి, ప్రతిఫలంగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను క్రిడ్ ప్రోకోగా తీసుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో చంద్రబాబును ఈ కేసులో ఏ-1గా చేర్చిన సీఐడీ... మాజీ మంత్రి నారాయణను ఏ-2గా చేర్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొన్న సీఐడీ.. మెమో దాఖలు చేసింది.

Tags:    

Similar News